Swachh Survekshan works : పైన పటారం.. లోన లొటారం అనే మాట ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న సుందరీకరణ పనులకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. పగిలిపోయిన డివైడర్లు, పెచ్చులూడిన వంతెనలు, నెర్రెలు వచ్చిన గోడలకు మరమ్మతు చేయకుండానే రంగులు వేసి సరిపెడుతున్నారు. పైపైన రంగుల పూతలు, నాసిరకం పనులతో గుత్తేదారులు సరిపెడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
నగర సుందరీకరణ..స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించటం కోసం గుంటూరు నగరపాలక సంస్థ వివిధ రకాల పనులు చేపడుతోంది. దీనికోసం భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నా... ఆ పనులకు సార్థకత ఉండడం లేదు. ముఖ్యంగా డివైడర్లు, వంతెనలు, గోడలకు రంగులు వేసే పనులు ప్రణాళికాబద్ధంగా సాగడం లేదు. డివైడర్‌కు వేసిన రంగులు అందంగా కనిపించాలంటే కనీసం దానిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి తొలగించి తొలుత సున్నం వేయాలి. మక్కు పెట్టిన తర్వాత చివరిగా పెయింటింగ్ వేయాలి. ఇలా చేస్తే ఆ రంగుల డిజైన్లు అందంగా కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం నగరంలో జరుగుతున్న సుందరీకరణ పనుల్లో.. ఏం రంగులు వేస్తున్నారో, వాటి నాణ్యత ఏమిటో పట్టించుకోవడం లేదు. పనులు దక్కించుకున్న గుత్తేదారులు అడ్డదిడ్డంగా రంగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడైనా డివైడర్‌కు ప్యాచ్ వర్కులు ఉంటే వాటికి మరమ్మతు చేయకుండానే రంగులేసి గుత్తేదారులు చేతులు దులిపేసుకుంటున్నారు.
అవగాహన శూన్యం... స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా రంగులు వేస్తున్నామని చెబుతున్న అధికారులు.. ఆ స్ఫూర్తి ప్రజలకు తెలియజేయటం మరిచారు. ప్రజల్ని సైతం సుందరీకరణ, స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్తుల్ని చేసే సందేశాలు ఎక్కడా కనిపించటం లేదు. కనీసం తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుధ్య కార్మికులకు ఎలా అందించాలో తెలిపే బొమ్మలు కూడా లేవు. అసలు నగరంలో గుంతలు పడిన రోడ్లకు మరమ్మతు విషయం మర్చిపోయిన అధికారులు.. రంగులు వేసి అందంగా చేశామని చెబితే ఉపయోగం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఇలాంటి పనులు చేయిస్తున్న అధికారులు వాటి నాణ్యత విషయం కూడా ఆలోచించాలంటున్నారు.
నాసిరకమైన రంగులు వాడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కమీషన్లు తీసుకుంటున్నారు. ఒక్క వర్షం వచ్చినా రంగు అంతా కొట్టుకుపోతుంది. ఏ మాత్రం మరమ్మతు లేకుండా రంగులు వేసి మమ అనిపిస్తున్నారు. కనీసం ఇళ్ల ముందు గుంతలైనా పూడ్చాలి. - సిరిపురపు శ్రీధర్, ప్రజా చైతన్య వేదిక వ్యవస్థాపకులు
డివైడర్లకు వేస్తున్న రంగులు గమనిస్తే.. పైన పటారం లోన లొటారం అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పనులు బయట నుంచి వచ్చిన వాళ్లు చూస్తే నమ్ముతారేమో గానీ, స్థానిక ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజాధనం వృథా కావడం దారుణం. -కొండా శివరామిరెడ్డి, అవగాహన సంస్థ కార్యదర్శి