ఇదేంటి.. నగర పాలక సంస్థ బోర్డు రోడ్డు మీద పడి ఉంటే ఎవరూ పట్టించుకోలేదు.. దాన్ని తీసి కనీసం పక్కన పెట్టటం లేదు అనుకుంటే.. మీరు కూడా బురదలో కాలేసినట్లే. అవును ఇక్కడ గుంత పక్కన చూస్తున్నది నగర పాలక సంస్థ బోర్డే అయినా.. అక్కడ గుంత ఉందని గుర్తించడానికి స్థానికులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు అది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు నగర శివారు బుడంపాడు వద్ద రహదారులు గుంతలమయంగా మారాయి. రాత్రివేళల్లో ప్రయాణించే వాహనదారులకు గుంతలు కనిపించక.. అందులో పడి ప్రమాదం బారిన పడుతున్నారు. ఇది గమనించిన స్థానికులు రహదారి పక్కనే ఉన్న నగరపాలక సంస్థ బోర్డును.. ప్రమాదాలు నివారించే, ప్రమాద సూచికగా పెట్టారు.
పట్టించుకోని అధికారులు.. హెచ్చరికగా మారిన ఆ సంస్థ బోర్డు - roads in guntur district latest news update
గుంతలు పడ్డ రోడ్లను అధికారులు పట్టించుకోకపోవటంతో.. గుంటూరు నగర శివారు బుడంపాడు వద్ద రహదారులు గుంతలమయంగా మారాయి. నివర్ తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు మరింత అధ్వానంగా తయారయ్యాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో.. ఆగ్రహించిన స్థానికులు తమదైన శైలిలో నిరసన తెలిపారు.
ప్రమాద సూచిక ఏర్పాటు చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కర్రలను పాతి పెట్టొచ్చు.. రాళ్లను కూడా గుంతలకు కొద్ది దూరంలో ఉంచవచ్చు. ఇన్ని ఉంటుంటే నగర సంస్థ బోర్డునే బురదలో వేయాల్సిన అవసరం ఏముంది అంటే స్థానికులు మాత్రం ఘాటుగానే స్పందిచారు. అధికారాలకు కనువిప్పు కల్గించడానికే ఇలా వినూత్నంగా బోర్డును రహదారిపైన ఉంచినట్లు సెలవించారు. ఇంకేముంది వచ్చిపోయే ప్రయాణికులకు ధన్యవాదాలు చెప్పేందుకు ఉన్న బోర్డు కాస్తా... రోడ్డుపై బురదలో దర్శనమిస్తోంది.
ఇవీ చూడండి...