ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమరాంధ్ర-2019: పల్నాడులో పవర్ చూపిన ఫ్యాన్ పార్టీ

అధికారంలోకి రావాలంటే ఆ జిల్లాలో పాగా వేయాల్సిందే. తూర్పుగోదావరి తర్వాత అత్యంత కీలకం. వీటన్నింటికి తోడు హేమాహేమీలు బరిలో నిలిచి నియోజకవర్గాలు. అలాంటి జిల్లాను గురి చూసి కొట్టింది వైకాపా. అంతేకాదు నవ్యాంధ్ర రాజధానికి పునాదులు పడిన గుంటూరు గడ్డపై 15 స్థానాలను గెలుచుకొవటంతో ఫ్యాన్ గాలికి ఎదురులేకుండా పోయింది.

సమరాంధ్ర-2019:పల్నాడులో పవర్ చూపిన ఫ్యాన్ పార్టీ

By

Published : May 24, 2019, 3:31 AM IST


రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లాది ప్రత్యేక స్థానం. చారిత్రకంగానే కాదు రాజకీయ చైతన్యంలోనూ మేటి. కిందటిసారి ఎన్నికల్లో 12 స్థానాలు తెదేపా ఖాతాలోకి వెళ్తే... వైకాపా ఐదుతో సరిపెట్టుకుంది. కానీ ఈసారి లెక్క సరి చేసింది వైసీపీ. జిల్లాలో ఉన్న 17 స్థానాలకు గానూ 15 సీట్లను గెలుచుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. పలువురు మంత్రులతోపాటు శాసన సభాపతిని ఓడించి పల్నాడు గడ్డపై పవర్ చూపింది వైకాపా.


ఈసారి ఎలాగైనా అధికారాన్ని కొట్టాలన్న కసితో పావులు కదిపిన వైసీపీ.. అనుకున్నట్లే గుంటూరు జిల్లాలోనూ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. కిందటిసారి కేవలం ఐదు సీట్లతో సరిపెట్టుకుంటే.. ఈసారి మాత్రం ఆ సంఖ్యను 15కు పెంచుకుంది. ఈ జిల్లాలోని మంగళగిరి ఎన్నిక జిల్లాకే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే హాట్‌ టాపిక్‌. తెలుగుదేశం అభ్యర్థిగా మంత్రి లోకేష్, వైకాపా తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉండటమే ఇంతటి ఆసక్తికి కారణమైంది. తప్పక గెలుస్తామని భావించిన తెదేపాకు ఓటమి రుచి తగిలింది. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న లోకేష్ ఓటమి చెందారు. వైకాపా తరపున బరిలో ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి విజయం సాధించారు.


జిల్లా నుంచి మంత్రిగా వ్యవహరించిన.. వేమూరు తెదేపా అభ్యర్థి నక్కా ఆనందబాబు వైకాపా అభ్యర్థి మేరుగు నాగార్జున చేతిలో ఓటమి పాలయ్యారు. చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని అనుకున్న అతనికి పరాభావం తప్పలేదు. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన ఆయన వైకాపా అభ్యర్థిని వి.రజిని చేతిలో ఓడిపోయారు. పొన్నూరు నియోజకవర్గంలో ఈసారి కూడా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని కలలు కన్న తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు చుక్కెదురైంది. వైకాపా అభ్యర్థి కిలారి రోశయ్య చేతిలో ఓటమి చెందారు.


జిల్లాలో అత్యంత ఆసక్తి రేకిత్తించిన మరో నియోజకవర్గం సత్తెనపల్లి... ఇక్కడి నుంచి తెదేపా తరఫున బరిలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్​పై వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు భారీ మెజార్టీతో విజయం సాధించారు. జిల్లాలో త్రిముఖ పోరు తప్పదని భావించిన తెనాలిలో వైకాపా జెండానే ఎగిరింది. తెదేపా అభ్యర్థిపై అన్నాబత్తుని శివకుమార్ విజయం సాధించారు. ఇదే స్థానం నుంచి పోటీ పడిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్​కు ఓటమి తప్పలేదు. పొలిటికల్ హీట్​ను పెంచిన మరోస్థానం ప్రత్తిపాడు...ఇక్కడ తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ పై వైకాపా అభ్యర్థి ఎం.సుచరిత విజయం సాధించారు. జనసేన నుంచి బరిలో ఉన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఓటమి రుచి చూశారు. జిల్లాలో హోరీహోరీగా సాగిన వినుకొండ ఎన్నికల పోరులో వైకాపా అభ్యర్థి బోళ్ల బ్రహ్మనాయుడు విజయం సాధించారు. బాపట్లలో వైకాపా అభ్యర్థి కోన రఘపతి, గుంటూరు తూర్పులో మహ్మద్ ముస్తాఫా షేక్ గెలుపొందారు. తాడికొండ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన తెనాలి శ్రావణ్ కుమార్ ఓడిపోయారు. కేవలం రేపల్లె, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో మాత్రమే సైకిల్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మిగిలిన అన్ని చోట్ల వైసీపీ సత్తా చాటింది.
వైకాపా 15 స్థానాలు గెలవటంతో కీలకమైన గుంటూరు జిల్లాలో తప్పక పాగా వేయాలన్న ఆ పార్టీ ఆశ నెరవేరినట్లైంది. రాజధాని ప్రాంతమైన పల్నాడు గడ్డపై పౌరుషాన్ని చూపింది వైసీపీ.

ఇదీ చదవండీ:తెదేపా ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయిందంటే...!?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details