ఘనంగా సంక్రాంతి సంబరాలు - పండగ శోభకు వన్నె తెచ్చిన సాంస్కృతిక కార్యక్రమాలు Grand Sankranti Celebrations in AP: రాష్ట్రంలో ఊరూవాడా సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. పిల్లలు, పెద్దలు అందరూ పండగను ఘనంగా జరుపుకున్నారు. పంతంగుల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలతో చాలా చోట్ల సందడి వాతావరణం నెలకొంది. నూతన వస్త్రాలు ధరించి బాణసంచా కాలుస్తూ పిల్లలు సందడి చేశారు. పిండివంటకాలతో మకర సంక్రాంతిని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం న్యూకాలనీ వాసులు గాలిపటాలు ఎగురవేసి సందడిగా గడిపారు. విజయనగరం రాజీవ్ స్టేడియంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పతంగుల పోటీలు ఘనంగా జరిగాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సంక్రాంతి సంబరాలు ప్రేక్షకులను విశేషంగా అకట్టుకున్నాయి. గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా రూపోందించిన పలు సెట్టింగ్‌లను చూసేందుకు సందర్శకులు పోటీపడ్డారు. సంక్రాంతి సంబరాలను పురష్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అబ్బురపరుస్తున్న 100 మీటర్ల సంక్రాంతి ముగ్గు
ఆకట్టుకున్న బాణాసంచా: కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాణసంచా కాల్పులు ఆకట్టుకున్నాయి. వాటిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆటపాటలతో యువత సందడి చేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు : కొవ్వూరు మండలం ధర్మవరంలో వెంపాటి కుటుంబాలు ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. ఎనిమిదేళ్లుగా పండుగ రోజు గ్రామానికి చేరుకుని 3 రోజులు ఉత్సాహంగా గడుపుతామని కుటుంబసభ్యులు చెప్పారు.
సంక్రాంతి వేళ జోరుగా సాగుతున్న పోటీలు - భారీగా తరలివస్తున్న ప్రజలు
ఘనంగా ముగ్గుల పోటీలు: గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అందరినీ అలరించాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ గాయనులు యామిని, హారిక, ఉమ పాల్గొని పాటలతో అలరించారు. గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
బాపట్ల జిల్లా చినగంజాం మండలం గొనసపూడిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గానిపల్లిలో చెన్నకేశవస్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ వీధుల్లో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో సంక్రాంతి సందర్భంగా తెలుగుదేశం నేత గంట నరహరి ఆధ్వర్యంలో నాలుగు థియేటర్లలో ప్రజలకు ఉచితంగా సినిమాల ప్రదర్శన నిర్వహించారు.
చంద్రన్న సంక్రాంతి సంబరాలు - అంబరాన్నంటేలా మహిళా కబడ్డీ పోటీలు