Grama Sachivalayam Employees Problems: ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఆనందపడాలో.. అరకొర జీతంతో కుటుంబాన్ని ఎలా గడపాలని బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు సచివాలయ ఉద్యోగులు. సాప్ట్‌వేర్ వంటి ఉన్నత ఉద్యోగాలు వదులుకుని మరీ ఉన్న ఊరిలో బతుకుదామని వచ్చిన సచివాలయ ఉద్యోగులకు.. ముఖ్యమంత్రి జగన్ తీయని మాటలు చెప్పి చేతులు దులుపుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం చేసే భాగ్యం తక్కువ మందికే వస్తుందని.. మీరు గొప్ప అదృష్టవంతులంటూ కితాబిచ్చి.. మీ ప్రాంత ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకోండంటూ నియామక పత్రాలు అందజేసిననాడే తేల్చి చెప్పారు. అరకొర జీతంతో నెట్టుకొస్తున్న సచివాలయ ఉద్యోగులపై అదనపు పనిభారం మోపుతున్నారు. చేస్తున్న ఉద్యోగంతో సంబంధం లేకుండా ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నారు.
Secretariat Employees Dharna ఇక్కడ విధులు నిర్వహించలేకపోతున్నాం.. మౌన దీక్షలో సచివాలయ ఉద్యోగులు!
చెప్పిన పని చేయకుంటే తాఖీదులివ్వడం.. జీతాలు నిలిపివేస్తామని అధికారుల బెదిరింపులతో సచివాలయ ఉద్యోగులు హడలిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అనగానే ఆర్థిక భద్రత-భవిష్యత్తుకు భరోసా ఉంటుందని ఆశతో ఉద్యోగంలో చేరిన వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రైవేట్ సంస్థల్లో మంచి జీతాలు వదులుకుని సాఫీగా సాగుతున్న జీవితాన్ని ప్రభుత్వ ఉద్యోగమనే భ్రమతో చేజార్చుకున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ బాధలు భరించలేకే.. ఇప్పటి వరకు దాదాపు 10వేల మంది ఉద్యోగాలు వదులుకుని వెళ్లిపోయారు.
సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం ఇతర పనులకు యథేచ్ఛగా వినియోగిస్తోంది. సంక్షేమ సహాయకులు, విద్య, అభివృద్ధి కార్యదర్శులకు కీలకమైన బూత్ స్థాయి ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాల్లో సవరణల పనులు చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్రియాశీలకంగా ఉన్న వీరికి బీఎల్ఓ బాధ్యతలు అప్పగించొద్దని గ్రామ, వార్డు సచివాలయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చినా అమలుకు నోచుకోలేదు.