ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వానికి ఉద్యోగుల వేదన పట్టదా..?.. అమలుకు నోచుకోని జగన్​ హామీలు - employees fires on cm jagan over his promises

EMPLOYESS PROBLEMS : అన్ని ప్రభుత్వశాఖల్లో ఒప్పంద ఉద్యోగులను వారి అర్హత, సర్వీసు ఆధారంగా క్రమబద్ధీకరిస్తాం. సీపీఎస్‌ రద్దుచేసి.. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తాం. ‘సమాన పనికి-సమాన వేతనం’ ప్రాతిపదికగా పొరుగు సేవల సిబ్బందికి న్యాయం చేస్తాం. సకాలంలో పీఆర్సీ అమలు చేస్తాం.. అంటూ ఎన్నిక ప్రచార సభల్లో వైఎస్సార్​సీపీ అధ్యక్షుడి హోదాలో జగన్‌ మోహన్​ రెడ్డి ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చకపోగా.. చేయమని అడుగుతూ ఆందోళన చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

EMPLOYESS PROBLEMS
EMPLOYESS PROBLEMS

By

Published : Mar 13, 2023, 7:31 AM IST

ప్రభుత్వానికి ఉద్యోగుల వేదన పట్టదా..?.. అమలుకు నోచుకోని జగన్​ హామీలు

EMPLOYESS PROBLEMS : అధికారంలోకి రాగానే ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తామంటూ.. ప్రతిపక్ష నేతగా జగన్‌ మోహన్​ రెడ్డి ప్రతి సమావేశంలోనూ చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఒకటో తేదీన జీతాలు ఇవ్వడమే గొప్ప అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మూడున్నర సంవత్సరాలుగా ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం అటకెక్కించింది. పీఆర్సీ, జీపీఎఫ్‌, డీఏ బకాయిలు, క్లెయిములు, ఏపీజీఎల్‌ఐ అడ్వాన్సులు, ఆర్జిత సెలవుల చెల్లింపులకు ఉద్యోగులు ఎదురుచూడాల్సి వస్తోంది.

నాలుగు సంవత్సరాలు అవుతున్నా నేరవేరని సీపీఎస్​ రద్దు: సీపీఎస్‌ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ లాంటి హామీలకు నాలుగు సంవత్సరాలు అవుతోన్నాఇప్పటికీ అతీగతీ లేదు. హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిస్తే పోలీసులతో అణచివేస్తోంది. సీపీఎస్‌ రద్దు చేయకపోగా.. ఈ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన 10 శాతాన్ని సంవత్సరం నుంచే వాడేసుకుంటోంది. ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమం చేపట్టింది. మే 1న ‘సీపీఎస్‌ ఉద్యోగుల ఉప్పెన’ పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది.

ఒక్కో ఉద్యోగికి సుమారు రెండున్నర లక్షల బకాయి: డీఏ బకాయిలు, పీఆర్సీ కలిపి 7 వేల 200 కోట్ల రూపాయలను ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. 2018 జులై నుంచి 2020 మార్చి వరకు డీఏలు, 2020 ఏప్రిల్‌ నుంచి పీఆర్సీ బకాయిలు కలిపి ఒక్కో ఉద్యోగికి సుమారు లక్షా 20 వేల నుంచి రెండు లక్షల 50వేల రూపాయల వరకు రావాలి. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేస్తే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు చెల్లిస్తాయా? ఈ బకాయిలకు చట్టబద్ధత రావాలంటే కొంత మొత్తం వడ్డీతో బాండ్లు ఇవ్వాలని, దీనికి ఉత్తర్వులు జారీ చేయాలని ఉద్యోగులు డిమాండు చేస్తున్నారు. 2022లో ఇవ్వాల్సిన రెండు డీఏలు, ఈ సంవత్సరం జనవరిలో ఇవ్వాల్సిన డీఏలను ఇంతవరకూ ప్రకటించలేదు. జులై 2018 , జనవరి 2019 డీఏ బకాయిలను ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపి, జీతాలను నుంచి ఆదాయ పన్ను మినహాయించేశారు.

చరిత్రలో తొలిసారి మధ్యంతర భృతి కన్నా తక్కువ ఫిట్​మెంట్​: పీఆర్సీ చరిత్రలో తొలిసారి ప్రభుత్వం మధ్యంతర భృతి కన్నా తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ఐఆర్‌ 27శాతం కాగా.. ఫిట్‌మెంట్‌ 23శాతం ఇచ్చింది. ఉద్యోగుల నిరసనల తర్వాత వ్యత్యాసం రికవరీని నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి అద్దె భత్యాన్నీ తగ్గించింది. అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని ఎన్నికలకు ముందు జగన్‌ ప్రతి సభలోనూ చెప్పారు. ఇప్పుడు సీపీఎస్‌ రద్దు చేయకపోగా.. ఈ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన డబ్బులను సైతం వాడుకుంటోంది.

గతంలో సీపీఎస్​పై అధ్యయనానికి ఠక్కర్​ కమిటీ: ఫిబ్రవరి 2022 నుంచి ఇప్పటి వరకు సీపీఎస్‌ ప్రాన్‌ ఖాతాకు జమ చేయలేదు. ప్రభుత్వం, ఉద్యోగులు వాటా కలిపి 2 వేల 600కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆలస్యంగా జమ చేయడం వల్ల రాబడి తగ్గిపోతుంది. గత ప్రభుత్వం సీపీఎస్‌పై అధ్యయం చేయడానికి ఠక్కర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి ప్రభుత్వంతో సంబంధాలు తెగిపోతున్నందున పింఛను ట్రెజరీ లేదా పీఏఓ ద్వారా చెల్లించాలని కమిటీ పేర్కొంది. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, కుటుంబ పింఛను కొనసాగించాలని సూచించింది. ఇప్పుడు సుమారుగా వీటినే గ్యారంటీ పింఛను పథకం-జీపీఎస్‌ పేరుతో ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.

అగమ్యగోచరంగా ఉద్యోగుల పరిస్థితి: పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను పెంచి, భద్రత కల్పిస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. వేతనాల పెంపు డిమాండును పట్టించుకోవడం లేదు. అవుట్‌ సోర్సింగ్‌ వారి మెడపై తొలగింపు కత్తి పెడుతోంది. తొలగింపు ఆదేశాలు ఇచ్చినా.. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అధ్యయనానికి 2019 జులై 10న ప్రభుత్వం ఓ మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. అప్పటి మంత్రులు మారిపోయినా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కానీ, అందరికీ దీన్ని అమలు చేయట్లేదు. దీంతో కొందరు ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details