ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆక్సిజన్ పడకలు పెంచేందుకు సర్కార్ కసరత్తు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలను ప్రభుత్వం వేగంగా సిద్ధం చేస్తోంది. ఆక్సిజన్ పడకల సంఖ్యను 30 వేల వరకూ పెంచాలని వైద్యారోగ్యశాఖ ఆలోచన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో అత్యవసర చికిత్సకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. క్షేత్రస్థాయిలోని ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ కరోనా టెస్టులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

By

Published : Jul 28, 2020, 4:07 PM IST

state arrangements for oxygen beds
కాటమనేని భాస్కర్

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో మౌలికసదుపాయాలు, పడకల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.. ప్రత్యేకించి ఆక్సిజన్ పడకల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17 వేల పైచిలుకు ఆక్సిజన్ పడకలు సిద్ధంగా ఉండగా.. మరో 8 వేలకు పైగా ఆక్సిజన్ సదుపాయం కలిగిన పడకలను సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ , ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం ప్రతీ పడకకూ ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 30 వేల వరకూ పడకల్ని సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరగటంతో పాటు, చికిత్స కోసం ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మధుమేహం, తీవ్రస్థాయిలో రక్త పోటు, ఆస్తమా లాంటి సమస్యలతో ఉన్న రోగులు ఎక్కువగా వస్తుండటంతో ఆక్సిజన్ సదుపాయం అవసరం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా 1090 మంది మృతి చెందితే.. మృతుల్లో అత్యధిక శాతం మంది తీవ్రమైన మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు, తీవ్రస్థాయిలో రక్తపోటు, గుండె జబ్బుల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారేనని వైద్యారోగ్యశాఖ అంచనా వేస్తోంది. దీంతో రాష్ట్రంలో వెంటిలేటర్ల సంఖ్యను సైతం పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1500 వరకూ వెంటిలేటర్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వెంటిలేటర్లను సరఫరా చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నిత్యం 50 వేల వరకూ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ప్రభుత్వం ఇక నుంచి రాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో కొవిడ్ టెస్టులు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విస్తృతంగా కొవిడ్ పరీక్షలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రజలందరికీ ఆస్పత్రులు కొవిడ్ పరీక్షలకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్, ట్రూనాట్ యంత్రాలు ఇలా ఏది వీలైతే ఆ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందిగా ప్రభుత్వం అధికారులకు సూచించింది. ర్యాపిడ్ యాంటీ జెన్, ట్రూనాట్ యంత్రాల ద్వారా పరీక్షలు చేస్తున్నందున ఖరీదైన ఆర్టీపీసీఆర్ యంత్రాల ద్వారా చేసే నిర్ధారణ పరీక్షలపై భారం తగ్గిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్​లు కూడా ఈ పరీక్షలు చేసేందుకు అనుమతులు ఇచ్చామని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లోనూ కొవిడ్ చికిత్స ఉచితమే.. బీపీఎల్, ఏపీఎల్ కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఉచితంగానే చికిత్స చేయించుకోవచ్చు. కొవిడ్ కు సంబంధించి పరీక్షలు, చికిత్సల్లో 95 శాతం ప్రభుత్వమే చేస్తుంది- కాటమనేని భాస్కర్
ఆరోగ్యం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్

ఇదీ చదవండి:పోలీసుశాఖలో కరోనా కలకలం..

ABOUT THE AUTHOR

...view details