వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటలతోపాటు ఆహార పదార్థాల నాణ్యత నిర్ధారించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుంటూరులోని లాంఫామ్‌లో ప్రయోగశాల సిద్ధమవుతోంది. ఇది అందుబాటులోకి వచ్చాక... స్థానికంగా మనం వినియోగించే ఆహార పదార్థాలు, పానీయాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే వాటికి నాణ్యతను పరీక్షించవచ్చు. ఆహార పదార్థాలను పరీక్షించి నాణ్యతా ధ్రువపత్రాలు మంజూరు చేయనున్నారు.
తద్వారా రసాయనాలు లేని ఆహార పదార్థాలను అందించేందుకు ప్రయోగశాల ఉపయోగపడుతుంది. అలాగే చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తులను నిల్వ ఉంచే క్రమంలో ఆరోగ్యానికి హానికలిగించే రసాయనాలు ఏమైనా వినియోగించారనేది తెలుసుకోవచ్చు. వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం తరపున ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి భవన నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నారు.