ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిలో ఆగని మృత్యుఘోష... ఆవిరైన 29గ్రామాల ప్రజల ఆశలు - అమరావతిలో రైతుల మరణాల వార్తలు

రాజధాని వస్తే బతుకులు బాగుపడతాయంటూ భూములిచ్చిన అమరావతి రైతుల గుండెలు... సర్కారు నిర్ణయాలతో ఆగిపోతున్నాయి. 66 రోజులుగా నిరసన పథంలో ఉన్న అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఇప్పటి వరకు ఐకాస లెక్కల ప్రకారం 44 మంది అకాలమరణం చెందారు. వీరిలో వృద్ధాప్యం, అనారోగ్యం వంటి కారణాలతో పోయిన వారిని పక్కన పెట్టినా... మరో 28 మాత్రం జగన్ సర్కారు నిర్ణయాలతో గుండె పగిలి చనిపోయినవారే. వీరిలో భూములిచ్చిన రైతులతో పాటు పనిదొరక్క కుటుంబాన్ని పోషించే దారి తెలీక దిగులుతో ప్రాణాలొదిలిన రైతు కూలీలు ఉన్నారు.

farmers death at amaravathi
అమరావతిలో ఆగుతున్న రైతన్నల గుండెలు

By

Published : Feb 22, 2020, 5:31 AM IST

Updated : Feb 22, 2020, 1:59 PM IST

అమరావతిలో ఆగుతున్న రైతన్నల గుండెలు

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులంటూ వైకాపా సర్కారు ప్రకటన చేసిన నాటి నుంచి 66రోజుల వ్యవధిలో అమరావతి గ్రామాల్లో... 28 మంది హఠాన్మరణం చెందారు. వీరిలో రెండు బలవర్మరణాలు. వీరిలో రాజధాని నిర్మాణానికి భూ సమీకరణలో భూముల్చిన 19 మంది రైతులు, 9 మంది వ్యవసాయకూలీలు ఉన్నారు. రాజధాని కోసం ఉద్యమిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి ఐకాస చెబుతున్నలెక్కల ప్రకారం ఆ చావులు దాదాపు 44కి చేరాయి. రాజధాని తరలిపోతుందన్న బెంగ, పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందన్న భయంతో తమ వాళ్లు చనిపోయినట్లు వారి బంధువులు చెబుతున్నారు.

భూములిచ్చిన వారిలో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే
అమరావతిలో ఆగుతున్న రైతన్నల గుండెలు

అమరావతి పరిధిలో జరుగుతున్న నిర్మాణ కార్యక్రమాలను వైకాపా సర్కారు నిలిపేయడంతో రైతు కూలీల బతుకులు మరింత ఛిద్రమయ్యాయి. భూములిచ్చిన వారిలో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. 85 శాతానికిపైగా రైతులకు రెండెకరాల కంటే తక్కువ భూమే ఉంది. రాజధాని పోరాటంలో పాల్గొంటున్న వారి పిల్లలను పోలీసులు కొట్టడం, ఇళ్లల్లోకి వచ్చి బెదిరించడం, అరెస్టు చేసి ఊరూరా తిప్పడం వంటి ఘటనలు చూసి తట్టుకోలేక కొందరు మరణించినట్లు బాధితు కుటుంబసభ్యులు చెప్పారు.

పలుమార్లు 144, 30 వంటి సెక్షన్ల విధింపుపై విచారం
అమరావతిలో ఆగుతున్న రైతన్నల గుండెలు

రాజధాని ప్రజలు మానసికంగా తీవ్ర ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నారు. అధికార పార్టీ నేతలు రోజుకొకలా మాట్లాడుతుండటంతో.. వార్తా ఛానళ్లు పెడితే, ఎప్పుడు ఎలాంటి ప్రకటన వినవలసి వస్తుందోనన్న భయంతో టీవీ చూడటమే మానేసినట్లు చెబుతున్నారంటే వారిలో భయం ఏ స్థాయిలో గూడుకట్టుకుందో అర్ధమవుతోంది. తాము చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని, పోలీసుల్ని మోహరించి గ్రామాలను దిగ్బంధిస్తోందని, పలుమార్లు 144, 30 వంటి సెక్షన్లనూ ప్రయోగిస్తోందంటూ బాధితులు వాపోతున్నారు.

ఒక్కరూ కూడా రాలేదు
అమరావతిలో ఆగుతున్న రైతన్నల గుండెలు

ఇంతమంది రైతులు, రైతు కూలీలు చనిపోయినా... అధికార పార్టీ నేతలెవ్వరూ బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. గుంటూరు జిల్లాలో ఇద్దరు మినహా మిగతా 15 మంది వైకాపా ఎమ్మెల్యేలే. బాపట్ల, నరసరావుపేట ఎంపీలు ఆ పార్టీ వారే. కృష్ణా జిల్లాలోనూ వైకాపాకి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రెండు జిల్లాల్లో వైకాపాకి ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నా... ఏ ఒక్కరూ బాధిత కుటుంబాలను పరామర్శించలేదు.

మరణాలకు ఒత్తిడే కారణం కావొచ్చన్న హృద్రోగ నిపుణులు
అమరావతిలో ఆగుతున్న రైతన్నల గుండెలు

రాజధానిలో సంభవిస్తున్న మరణాలకు ఒత్తిడే కారణం కావొచ్చని... హృద్రోగ నిపుణులు చెబుతున్నారు. రక్త నాళాల్లో చిన్నచిన్న అడ్డంకులు ఉన్నవారు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు హఠాత్తుగా రక్తం గడ్డకడుతుంది. గుండె పరిమాణం పెరిగి...కొట్టుకోవడం ఆగిపోతుంది. దీన్నే వైద్య పరిభాషలో టాకోసుబో, స్ట్రెస్‌ కార్డియో మయోపతిగా పిలుస్తారు. సహజంగా ప్రతి 100 మరణాల్లో 30 శాతం గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తాయి. ఇక్కడి మరణాల్లో అంతకంటే ఎక్కువ శాతం గుండె ఆగిపోవడంతోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయాల్లో ప్రజలు నిబ్బరంగా ఉండాలని మానసిక వైద్యులు సైతం చెబుతున్నారు.

ఇదీ చదవండి:రాజధాని అమరావతి బంద్​కు రైతుల పిలుపు

Last Updated : Feb 22, 2020, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details