ప్రభుత్వం దురాలోచనతోనే అర్హత ఉన్నా పింఛన్(pension) తొలగిస్తుందని.. తెదేపా నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు(ex minister pathipati pullarao) విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రజల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఏటా రూ.250 చొప్పున సామాజిక పింఛన్ పెంచుతానని హామీ ఇచ్చి.. ప్రస్తుతం అర్హత ఉన్నవారిని సైతం తొలగిస్తున్నారని మండిపడ్డారు.
తెదేపా అండగా ఉంటుంది
రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి పింఛన్ కోల్పోయిన వారికి తెదేపా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి పోరాటం చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వారి హక్కులను కాలరాస్తూ.. ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. వైకాపా నాయకులు సమావేశాలు, సభలు పెట్టినా కేసులు ఉండవని.. ఇతర పార్టీ వారు సభలు పెడితే పోలీసులు కేసులు నమోదు చేయడం రాష్ట్రంలో పరిపాలన పరిస్థితికి అద్దం పడుతుంది అన్నారు.