రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు పోరాటం చేస్తుంటే ..అధికార పార్టీ అక్రమాలు దౌర్జన్యాలతో దుర్వినియోగానికి పాల్పడుతుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాస గృహంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంతోపాటు చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం, సాతులూరు, కనపర్రు గ్రామాల్లో జరిగిన సంఘటనలు.. అధికార పార్టీ దౌర్జన్యాలకు నిదర్శనమని ఆరోపించారు.
అమీన్ సాహెబ్ పాలెం గ్రామంలో వైకాపా వారే ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టి... అక్కడ గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసి.. వారే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నారు. కనపర్రు గ్రామంలో తెదేపా మద్దతుదారులుగా నామినేషన్ వేస్తున్న వారిని... బుక్కాపురం గ్రామం నుంచి వైకాపా నాయకులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలపై వచ్చి బెదిరించడం దుర్మార్గపు చర్య అన్నారు.