Ex Minister Kollu Ravindra Cycle Yatra Stopped by Police:తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కొల్లురవీంద్ర అరెస్టు తీరుపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని.. తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. నిన్న ఉదయం కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు అర్ధరాత్రి వరకు వివిధ స్టేషన్లు తిప్పుతూ.. చివరకు మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద వదిలి వెళ్లారు. పోలీసుల తీరును ఖండించిన కొల్లు.. వారిపై న్యాయపోరాటం చేస్తానన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం మాజీమంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ యాత్ర చేపట్టారు. యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని నాగాయలంక స్టేషన్‌కు తరలించారు. కొల్లు రవీంద్రకు మద్దతుగా వెళ్లిన మండలి బుద్ధ ప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ ను పోలీసులు అరెస్టు చేసి.. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు పోలీస్ స్టేషన్కి తరలించారు.
రవీంద్రకు సంఘీభావంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసు స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో కొల్లు రవీంద్రకు నోటీసులు ఇచ్చి తిరిగి బందరు తీసుకెళ్లి వదిలేస్తామని పోలీసులు తెలిపారు. కానీ, అలా చేయకుండా అర్ధరాత్రి వరకూ నిడమోలు, కూచిపూడి, నాగాయలంక ప్రాంతాల్లో తిప్పారు. కొల్లు రవీంద్ర అదృశ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు హౌజ్ మోషన్ పిటిషన్ కు సిద్ధమయ్యారు.
నాగాయలంక స్టేషన్ నుంచి కొల్లును తీసుకువెళ్లిన పోలీసులు.. వెనుక వస్తున్న అనుచరుల వాహనాలను దారి మళ్లించి ఆయన్ను అజ్ఞాతంలోకి తీసుకు వెళ్లారు. తన తండ్రి ఆచూకీ తెలపాలంటూ కొల్లు రవీంద్ర కుమారుడు.. పునీత్ చంద్ర జిల్లా ఎస్పీని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. కృతివెన్ను పోలీస్ స్టేషన్లో కొల్లు రవీంద్రను ఆయన అనుచరులు కనుగొనడంతో.. పోలీసులు మళ్లీ అక్కడ నుంచి మచిలీపట్నం వైపు తరలించారు. చివరకు మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద వదిలివెళ్లారు.