Electricity Charges Hike in Andhra Pradesh: ఇప్పటికే పలుమార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరో వడ్డనకు తెరలేపింది. ఇందన సర్దుబాటు పేరిట యూనిట్‌కు 40పైసల వంతున మే నెల బిల్లుతో కలిపి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ బిల్లులు చూసి బెంబేలెత్తిపోతున్న సామాన్య ప్రజలు.. సర్దుబాటు పోటుతో మరింత షాక్ తిననున్నారు.
ఏప్రిల్ నెలలో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనేందుకు ఖర్చు చేసిన ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కంలు వసూలు చేస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నెలా ఈ ఛార్జీలను వసూలు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి.. డిస్కంలకు కల్పించింది. ఈఆర్సీ అనుమతి లేకుండానే గరిష్ఠంగా యూనిట్‌కు 40 పైసలు వసూలు చేసే అధికారం డిస్కంలకు ఉంది.
Power Subsidy In AP: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై బాదుడే బాదుడు
ఇలా వసూలు చేసిన మొత్తాన్ని సంవత్సరం చివరలో సర్దుబాటు చేయనున్నాయి. ఇప్పటికే ప్రతి నెలా వచ్చే బిల్లులో 2 వేల 910 కోట్లు, 3 వేల 83 కోట్లకు సంబంధించిన ట్రూఅప్ మొత్తాన్ని డిస్కంలు కలిపి వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు 3వ ట్రూఅప్ ప్రజలకు మరింత భారం కానుంది. ఎంత భారం పడుతుందన్న వివరాలను మాత్రం అధికారులు చెప్పడం లేదు.
ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటి వరకు గడిచించి కేవలం 2 నెలలే. ఈ రెండునెలల విద్యుత్ కొనుగోళ్లతోనే డిస్కంలు తట్టుకోలేని నష్టాలు వచ్చాయని లెక్కలు తేల్చాయి. వేసవిలో డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి బహిరంగ మార్కెట్ నుంచి కొనడానికి డిస్కంలు కోట్లు ఖర్చు చేశాయి. వినియోగదారుల నుంచి వసూలు చేసే బిల్లు కన్నా.. అధిక ధరకు మార్కెట్‌లో కొన్న విద్యుత్ వల్ల ఇంకా యూనిట్‌కు 1.20 రూపాయల వంతున నష్టం వస్తోందని.. డిస్కంలు లెక్క తేల్చాయి.