సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు గుంటూరు జిల్లా అధికారులు, పోలీసులు సన్నద్ధమయ్యారు. జిల్లాలో 17అసెంబ్లీ, 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో... 39లక్షల 74వేల మంది ఓటర్లుండగా... అందరు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 4వేల 417 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రి పంపిణీ చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదారుమందిని కేటాయించారు. ఈవీఎంలు, కంట్రోల్ ప్యానల్, వివి ప్యాట్లతో పాటు మొత్తం 57 రకాల వస్తువులను అందజేశారు. ప్రతి బృందంతో భద్రత కోసం ఇద్దరు పోలీసులను పంపించారు.
ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నద్ధం - 2019 poll
గుంటూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. సుమారు 35వేల మంది సిబ్బంది... 2 వేల మంది అధికారులు విధుల్లో ఉన్నారు. తెల్లవారుజామున 5.30గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఉదయం 5.30గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ఏజెంట్లు కూడా తెల్లవారుజామున 5గంటలకే పోలింగ్ కేంద్రానికి రావాలని అధికారులు చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి 50 ఓట్లు మాక్ పోలింగ్ నిర్వహించి... సరిగా నమోదవుతున్నాయో లేదో పరిశీలిస్తారు. ఏజెంట్లు సంతృప్తి చెందాక పోలింగ్ ప్రారంభిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసే సమయానికి వరుసలో వారందరినీ ఓటు వేసేందుకు అనుమతిస్తారు.
పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిపేందుకు జిల్లా పోలీసులు సిద్ధమయ్యారు. గుంటూరు అర్బన్ పరిధిలో 2 వేల మంది, గ్రామీణ పరిధిలో 4 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. 420 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించారు. అక్కడ ఆయుధాలతో కూడిన సిబ్బందిని పహారాగా ఉంచారు. ఓటర్లంతా ఎలాంటి భయం లేకుండా వచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పోలీసులు సూచిస్తున్నారు.