Toll-free number on issues in schools: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరణకు పాఠశాల విద్యాశాఖ 14417 టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటుచేసింది. మధ్యాహ్నభోజన పథకంలో భోజనం నాణ్యత, మెనూ అమలు, మరుగుదొడ్లు, పాఠశాలల నిర్వహణ, విద్యాకానుక పంపిణీ, నాణ్యత, ఉపాధ్యాయుల గైర్హాజరు, నాణ్యమైన బోధన, ఇతర అకడమిక్ అంశాలపై ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఫిర్యాదులు, అభిప్రాయాలు వెల్లడించేందుకు దీన్ని తీసుకొచ్చారు.
గిరిజన వసతిగృహాల మెనూలో కోత
గిరిజన సంక్షేమ వసతి గృహాల మెనూలో అధికారులు కోత విధించారు. విద్యార్థులకు ఇది వరకు వారానికి ఆరు రోజులు గుడ్డు, ఏడు రోజులు పాలు అందించేవారు. సవరించిన మెనూలో వారానికి నాలుగు రోజులు మాత్రమే గుడ్డు, పాలు అందించేలా మార్పు చేశారు. గతంలో వారంలో ప్రతిరోజూ అరటిపండునిచ్చేవారు. ప్రస్తుతం వారానికి మూడు రోజులు మాత్రమే అందించాలని నిర్ణయించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూలో మార్పులు చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి తెలిపారు.