vatti verlu Cultivation : వట్టివేర్లు.. మనవద్ద చాలామందికి తెలియని పంట. ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరి వంటి చోట్లే సాగవుతోంది. అలాంటి పంట సాగును గుంటూరు జిల్లాలో ఇద్దరు ప్రారంభించారు. ప్రైవేటు ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసిన శివరాంప్రసాద్, సాయిప్రసాద్‌లు ఏదైనా కొత్త పంట సాగు చేయాలని భావించారు. సాయిప్రసాద్ కు నూనెల తయారీలో అనుభవం ఉండటంతో యూపీ, పుదుచ్చేరిలో ఎక్కువగా పండించే వట్టివేర్లను సాగు చేయాలని నిర్ణయించారు. నరసరావుపేట సమీపంలోని కేసానుపల్లి వద్ద ఎకరా పొలంలో వట్టి వేర్లు వేశారు. పంట బాగానే వచ్చినప్పటికీ.... నల్లరేగడి భూముల్లో వేర్లను బయటకు తీయటం ఇబ్బందిగా మారింది.జేసీబీలు ఉపయోగించి వేర్లు తీయటానికి ఎకరాకు 40వేలు ఖర్చయింది. అది కూడా వేర్లు పూర్తిగా సేకరించలేని పరిస్థితి. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు టవర్ సాంకేతికత వైపు మళ్లారు.
టవర్ సాంకేతికత
టవర్ సాంకేతికతలో భాగంగా మొక్కలను పశువుల నుంచి కాపాడే ట్రీగార్డులను తీసుకున్నారు. దాని లోపల మల్చింగ్ షీట్ వేశారు. అప్పుడు నిలువుగా ఉండే డబ్బా ఆకారంలోకి వచ్చింది. అందులో కొబ్బరిపీచు, కాఫీ పొడి వ్యర్థాలు, కోళ్లఫారం వ్యర్థాలు, వర్మి కంపోస్టు మిశ్రమంతో నింపారు. టవర్ పై భాగంతో పాటు..చుట్టూ కూడా వట్టివేర్ల మొక్కలు నాటారు. ట్రీగార్డ్ ని చుట్టేందుకు వాడిన తీగలు తీస్తేచాలు మొక్కలు వేర్లతో సహా బయటకు వస్తాయి. వాటిని శుభ్రం చేయటం, వట్టివేర్లు సేకరించటం చాలా సులభతరమైందని సాగుదారులు చెబుతున్నారు.