1200 days of movement for the capital Amaravati: రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్న అవాస్తవాలను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తిప్పి కొట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా స్వాగతించి.. అక్కడే ఇల్లు కూడా నిర్మించుకున్నాను అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు పేరుతో భూములు ఇచ్చిన రైతులను మోసం చేశారన్నారు.
గత 1200 రోజులుగా రాజధాని అమరావతి రైతులు సుదీర్ఘ ఉద్యమాన్ని చేపట్టడం చారిత్రాత్మకమన్నారు. రైతులపై కేసులు పెట్టి, పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వెనక్కి తగ్గకుండా 1200 రోజులుగా అమరావతి రైతులు, మహిళలు.. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా ప్రకటించి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
"అమరావతి రాజధాని పోరాటం 1200 రోజులకు చేరుకోవడం అనేది నిజంగా చారిత్రాత్మకం. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పోరాటాలు జరిగాయి.. కానీ ఓ సుదీర్ఘమైన పోరాటం.. అందులోనూ భూములు ఇచ్చిన రైతులు, స్థానికంగా ఉన్న మహిళలు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చేస్తున్నారు. వారిపైన కేసులు బనాయించిన, జైళ్లకు పంపినా వాళ్లు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి.. అమరావతిని రాజధానిగా కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు.. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలోనే అమరావతి రాజధానికి స్వాగతం చెప్పావు. అదే విధంగా ఎన్నికల సమయంలో కూడా ఎక్కడా మారుస్తాను అని చెప్పలేదు. పైగా తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని.. అక్కడే కొనసాగుతుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చావు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మోసపు మాటలు చెప్తున్నావు.
అయినా హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని. దీనిపై సుప్రీంకోర్టుకు పోతే.. స్టే కూడా రాలేదు. తరువాత విశాఖపట్నం పోతావు అని అక్కడ ప్రజల ఆమోదం కోసం కూడా ప్రచారం చేశావు. కానీ స్పష్టంగా అక్కడ ప్రజలు చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో వారు ఏం కోరుకుంటున్నారో చెప్తూ.. మీ అభ్యర్థిని ఓడించారు. కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి తగవులు మాని.. విశాలమైన దృక్పథంతో అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. అదే విధంగా అన్ని జిల్లాలో అభివృద్ధి పథంలో ముందుకు పోవడానికి.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సరైన చర్యలు చేపట్టాలి". - కె రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
అమరావతి పోరాటం 1200 రోజులకు చేరుకోవడం చారిత్రాత్మకం: రామకృష్ణ ఇవీ చదవండి: