కరోనా నివారణ, నియంత్రణ చర్యలు వేగవంతం చేస్తున్నప్పటికీ అంతే వేగంగా కేసులు నమోదు కావడం గుంటూరు జిల్లా అధికారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నిన్న ఒక్కరోజే 17 కొత్త కేసులు నమోదు కాగా... జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 75కి చేరింది. రాష్ట్రంలో కర్నూలు తర్వాత అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా గుంటూరు నిలిచింది. ఒకే ఇంటిలో 10 మందికి పాజిటివ్‌గా తేలడం కరోనా తీవ్రతకు నిదర్శనం. దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వైరస్ ప్రభావంతో మృతి చెందారు. జిల్లాలో కరోనా కారణంగా చోటుచేసుకున్న రెండో మరణం ఇది.
నేడు పూర్తి లాక్‌డౌన్
ఈ పరిస్థితుల్లో గుంటూరు నగరంలో ఇవాళ పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించారు. మందుల దుకాణాలు, అత్యవసర వైద్య సేవలు తప్ప నిత్యావసరాలు, కూరగాయల అమ్మకాలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో 12 కంటైన్మెంటు జోన్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో రాకపోకలు నిషేధించారు. ప్రజలు ఏం కావాలన్నా స్థానికంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని సూచించారు. రహదార్లపై అనవసరంగా వచ్చే వాహనదార్లపై పీడీ యాక్టు కింద కేసులు పెట్టేందుకు వెనుకాడబోమని అధికారులు హెచ్చరించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను వేరుచేసే శంకర్ విలాస్ కూడలి, కంకరగుంట ఆర్వోబీలను పూర్తిగా దిగ్బంధం చేయనున్నారు.