గుంటూరు జిల్లాలో పల్లె, పట్టణం తేడా లేకుండా కరోనా కోరలు చాస్తోంది. దాదాపుగా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వైరస్ విస్తరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 243 కేసులు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే ఉన్నాయి. ప్రధానంగా గుంటూరులోని నల్లచెరువు, ఏటీ అగ్రహారం, ఏటుకూరు, ఐపీడీ కాలనీ, బ్రాడీపేట ప్రాంతాలు కరోనాతో వణుకుతున్నాయి.
జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ కేసుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. తాడేపల్లి మండలంలో 16, తెనాలి 23, నరసరావుపేట 25, మంగళగిరి 16 చొప్పున నమోదయ్యాయి. సత్తెనపల్లి, బొల్లాపల్లిలో 6 చొప్పున కేసులు, చిలకలూరిపేట 5, అమరావతిలో ఐదేసి కేసులు, పెద్దనందిపాడు 4, గురజాల, రేపల్లె, పిడుగురాళ్లలో మూడు కేసులు చొప్పున నమోదయ్యాయి. పెద్దకాకాని, శావల్యాపురం, తాటికొండ, మాచర్ల, చుండూరు, క్రోసూరులో రెండేసి కేసులు.. అచ్చంపేట, బాపట్ల , దాచేపల్లి, దుగ్గిరాల, దుర్గి, యడ్లపాడు, గుంటూరు రూరల్, ఈపూరు, నూజెండ్ల, పెదకూరపాడు, పొన్నూరు, రొంపిచర్ల, తుళ్లూరు, చుండూరు, వట్టిచెరుకూరు, వేమూరులో ఒకటి చొప్పున కేసులు బయటపడ్డాయి. ఒకేరోజు ఇంతపెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్తక, వాణిజ్యసంస్థలు, దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యకాలంలోనే నిర్వహిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో నానాటికి పెరుగుతున్న కేసుల క్రమంలో మంగళగిరిలో జిల్లాయంత్రాంగం సమీక్ష సమావేశం నిర్వహించింది. కరోనా కేసులను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన చర్యలపై చర్చించారు. కోవిడ్ నియంత్రణ జిల్లా ప్రత్యేక అధికారి రాజశేఖర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కరోనా కేసుల కట్టడిపై పురపాలక అధికారులకు దిశానిర్దేశం చేశారు.