ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరామర్శించడానికి వెళితే అరెస్టు చేస్తారా? - తెలుగు దేశం

గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన తెలుగు దేశం నేతలను అరెస్టు చేయడంపై తెదేపా నేతలు మండిపడ్డారు. ప్రశ్నించే ప్రజా గొంతును నలపాలనుకున్న వాళ్లంతా మట్టిలో కలిసిపోయారని హెచ్చరించారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

By

Published : Aug 16, 2021, 3:24 PM IST

హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేయటం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హత్యకు గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరటమే చేసిన తప్పా అని నిలదీశారు. పరామర్శకు వెళ్లిన తెదేపా నేతలను 5 నిమిషాల్లో అరెస్ట్ చేసిన పోలీసులు.. రమ్యను చంపిన నిందితుడిని మాత్రం అర్దరాత్రి వరకు పట్టుకోలేకపోయారని విమర్శించారు.

బాధిత కుటుంబాన్ని సీఎం పరామర్శించకపోగా.. పరామర్శకు వెళ్లిన తెదేపా నేతల్ని అరెస్ట్ చేయటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రూ.10 లక్షలిచ్చి చేతులు దులుపుకుంటే రమ్య కుటుంబానికి న్యాయం జరుగుతుందా? అని నిలదీశారు.

రెండేళ్లలో 500 మంది మహిళలపై.. దాడులు...

ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన తెలుగుదేశం నాయకులకు అరెస్టు చేయడం దారుణమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. రెండేళ్లలో 500పైగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగాయని, నేటికీ చాలా కేసుల్లో నిందితుల్ని పట్టుకోలేకపోవడం ప్రభుత్వ చేతకాని తనమని మండిపడ్డారు. నిందితులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తోందని ఆరోపించారు.

సానుభూతి తెలిపేందుకు వెళితే అరెస్టులా..?

దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబానికి సానుభూతి తెలపడానికి వెళ్లిన తెలుగుదేశం నేతలను అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రశ్నించే ప్రజా గొంతును నలపాలనుకున్న వాళ్లంతా మట్టిలో కలిసిపోయారని హెచ్చరించారు. ప్రివెంటివ్ అరెస్ట్ ఏవిధంగా చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రమ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. మహిళా హోం మంత్రి సొంత జిల్లాల్లోనే ఇంత దారుణం జరిగిందంటే శాంతి భద్రతలు ఎక్కడున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు..

గుంటూరులో ఎస్సీ యువతి రమ్యను చంపినవారిని పట్టుకోలేని అసమర్థ పోలీసులు తెదేపా నేతలను అడ్డుకోవడమేంటని ఆపార్టీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబాలను పరామర్శించే వారిని స్టేషన్​లో కూర్చోపెట్టే చర్యలు ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. గుంటూరులో విద్యార్థిని రమ్య హత్యను ఖండిస్తూ, ఆమె కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లిన తెదేపా నేత లోకేష్​తో పాటు ఇతర నాయకులను అరెస్టు చేయటంపై జేసీ తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబాలను కూడా పరామర్సించనీయరా అంటూ ప్రభుత్వంపై, పోలీసులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:lokesh arrest: గుంటూరు: పరమయ్యగుంటలో పరిస్థితి ఉద్రిక్తం.. నారా లోకేశ్ అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details