CM MEET WITH REGIONAL CO-ORIDANTORS : మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో సోమవారం సమీక్షించిన ముఖ్యమంత్రి.. దానికి కొనసాగింపుగా మంగళవారం ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీ అయ్యారు. ఏ ఎమ్మెల్యేనూ వదులుకోనని సోమవారం నాటి సమావేశంలో చెప్పిన సీఎం.. ప్రాంతీయ సమన్వయకర్తలతో మాట్లాడినప్పుడూ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, నియోజకవర్గాల్లో నాయకుల మధ్య అంతరాలున్నాయా అనే వివరాలపై చర్చించినట్లు సమాచారం.
ఆ రెండూ కీలకం: నియోజకవర్గాల్లో నాయకుల మధ్య అంతరాలుంటే మీరే చొరవ తీసుకుని పరిష్కరించండని సీఎం వారికి చెప్పినట్లు తెలిసింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వచ్చే నాలుగు నెలల పాటు మరింత ఉద్ధృతంగా చేపట్టాలని నిర్ణయించామని, ఆ దిశగా ఎమ్మెల్యేలు పని చేసేలా పర్యవేక్షించాలని సీఎం వారికి నిర్దేశించారు. ఈ నెల 7 నుంచి 20 వరకు ‘జగనన్నే మన భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా చేపట్టాలని.. ఇందులో భాగంగా ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే స్టిక్కర్లను ఇళ్లకు, ఆ ఇళ్లలోని వారి ఫోన్లకు అతికించే కార్యక్రమాన్నీ పక్కాగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మీదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలను ఏ ఎమ్మెల్యే ఎలా నిర్వహించారనే దానిపై ఎప్పటికప్పుడు నివేదించాలని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు ఈ రెండు కార్యక్రమాలూ కీలకమని సీఎం అన్నట్లు తెలిసింది.