ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటాం: సీఎం

"భారత్‌- చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వైకాపా అధ్యక్షుడిగానే కాదు, ఏపీ సీఎంగా మీ వెనుక ఉంటాను. మా రాష్ట్రంలోని ఆరు కోట్ల మంది ప్రజలూ మీకు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. మీ సమర్థ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకముంది.  దేశాన్ని మీరు సరైన మార్గంలో విజయవంతంగా నడిపిస్తారని విశ్వసిస్తున్నాం" - సీఎం జగన్‌

cm-modi
cm-modi

By

Published : Jun 20, 2020, 5:59 AM IST

దార్శనికత, దౌత్య సంబంధాలను వినియోగించుకోవడం ద్వారా ప్రధాని మోదీ భారత్‌-చైనా సరిహద్దుల్లోని సమస్యలకు పరిష్కారం కనుక్కుంటారనే నమ్మకంతో ఉన్నామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గల్వాన్‌ లోయలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీలతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నిర్వహించిన దృశ్య శ్రవణ సమావేశంలో జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ ఏ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామన్నారు. మీ సమర్థ నాయకత్వంపై నమ్మకముందని చెప్పారు. భారత సైనికులు 20 మంది అమరులు అవడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. వారి త్యాగాలకు ఏపీ తరఫున సెల్యూట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

సీఎం ఇంకా ఏమన్నారంటే...

శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు మోదీ కృషి

‘అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులంతా భుజం భుజం కలిపి మరణించిన సైనికులు కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత అణ్వస్త్ర యుగంలో ప్రపంచం మారుతోంది. కేవలం సైన్యంతో మాత్రమే యుద్ధం చేయలేం. దౌత్యం, వ్యాపార, ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా వివిధ రకాలుగా యుద్ధం చేయొచ్చు. 2014 నుంచి అంతర్జాతీయంగా మన దేశ గౌరవం, ప్రతిష్ఠ ఇనుమడించింది. ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులు అందరూ ఆ విషయం అంగీకరిస్తారనే అనుకుంటున్నా. భారత్‌ను ఆర్థికంగా, దౌత్యపరంగా శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు మోదీ కృషి చేశారు. ఆయన వివిధ దేశాల్లో విస్తృతంగా పర్యటించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా అంతర్జాతీయంగా సంబంధాలు మరింత బలపడ్డాయి. దేశాన్ని ముందు వరుసలోకి నడిపించారు. భారత్‌ ప్రపంచవ్యాప్తంగా బలమైన దేశంగా నిలిచి ఇతర దేశాలకు దారి చూపించింది. విజయవంతమైన విదేశీ విధానాలను అవలంబించటం ద్వారా అంతర్జాతీయంగా ప్రాధాన్యం సాధించాం. క్షిపణులు, జీవరసాయన ఆయుధాలు, ఆస్ట్రేలియా గ్రూపుల్లో భారత్‌ చోటు సంపాదించింది. ఐరాస భద్రత మండలిలో సభ్యదేశంగా ఎంపికైంది.

భారత విజయాలు పలువురికి కంటగింపుగా మారాయి

ప్రపంచ రాజనీతిజ్ఞుడుగా ప్రధాని అసాధారణ నైపుణ్యాలు చూపారు. దానివల్లే దేశానికి చిరస్మరణీయ విజయాలు సాధ్యమయ్యాయి. ఇవి పలువురికి కంటగింపుగా మారాయి. పరోక్ష శక్తుల ద్వారా దేశాన్ని అస్థిరపరచాలని ప్రయత్నించారు. అయినా ప్రధాని సమర్థ నాయకత్వంలో విజయం సాధించి ముందుకెళ్తున్నాం.పుల్వామా దాడి, డోక్లాం సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటింపజేయగలిగారు. కులభూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో వచ్చిన తీర్పు మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనం. ఆయన నాయకత్వంలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని నమ్ముతున్నాం. గల్వాన్‌ లోయలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నా. ఇరు దేశాల మధ్య సంబంధాల వ్యవహారంలో మా కంటే కేంద్రంలో ఉన్నవారికే బాగా తెలుసు. అందుకే ఈ అంశంలో మరింత లోతుగా వెళ్లదలుచుకోలేదు’ అని జగన్‌ అన్నారు.

ఇదీ చదవండి:పది పరీక్షలపై నేడో రేపో కీలక నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details