ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"జగనన్న కాలనీల్లో.. ఆ పనులకే రూ.కోట్లా.. ఖర్చు తగ్గించే ఆలోచన చేయరా?" - గుంటూరు జిల్లా తాజా వార్తలు

Jagananna Colonies: ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు గుంటూరు జిల్లా అధికారులపై మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల లేఅవుట్లలో స్థలాల మెరక పనులకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారని, బిల్లులు కూడా ఇష్టమొచ్చిన రీతిలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jagananna Colonies
అధికారులపై సీఎం అదనపు కార్యదర్శి ముత్యాలరాజు ఆగ్రహం

By

Published : May 22, 2022, 6:51 AM IST

Jagananna Colonies: గుంటూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల లేఅవుట్లలో స్థలాల మెరక పనులకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారని, బిల్లులు కూడా ఇష్టమొచ్చిన రీతిలో పెడుతున్నారని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు గుంటూరు జిల్లా అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు తగ్గించే ఆలోచన చేయరా అని నిలదీశారు. లేఅవుట్లలో మెరక పనులకు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ఖర్చు తగ్గించాలని ఆదేశించారు. శనివారం గుంటూరు కలెక్టరేట్‌లో వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల నిర్మాణాల ప్రగతి, భూసేకరణ, ఉపాధి హామీ పథకం, భూముల రీ సర్వే పనులపై జిల్లా, మండల అధికారులతో ఆయన సమీక్షించారు. లేఅవుట్లలో మెరకకు అవసరమైన మట్టి సేకరణకు అనుమతులు ఇవ్వడంలో తహసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ముత్యాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఅవుట్ల సమీపంలోని పొలాలు, కాలువల్లో మట్టి తవ్వేందుకు ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు. దీనికి ఎవరు ఒప్పుకుంటారని అధికారులు సందేహం వ్యక్తం చేయగా ‘ఆ విషయం నాకు తెలియదా? ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల కంటే ముఖ్యమైనవి ఏం ఉంటాయి’ అని నిలదీశారు.

లేఅవుట్లలో స్థలాల మెరక పనులపై జిల్లా పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీరింగ్‌ అధికారి జి.బ్రహ్మయ్య చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని ముత్యాలరాజు ఆయన్ను సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. లేఅవుట్ల సమీపంలో క్వారీల గురించి జిల్లా గనులశాఖాధికారి సత్యనారాయణ, గృహ నిర్మాణ పనుల్లో ప్రగతిపై జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు సాయినాథకుమార్‌ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో వారిపైనా ఆగ్రహించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకంలో చేసిన పనుల విలువకు, పెట్టిన బిల్లులకు తీవ్ర వ్యత్యాసం ఉండటంపై ప్రశ్నించారు. జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఓటీఎస్‌ పథకంలో గృహాల రుణాలను చెల్లించేలా చూడాలన్నారు. నవశకం సర్వేలో ఇళ్ల దరఖాస్తుదారుల్లో అర్హులకు 90 రోజుల్లో గృహాలు మంజూరు చేయాల్సి ఉండగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి ప్రకటించారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ భరత్‌ గుప్తా, జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details