తెలుగుదేశం పార్టీ ఇవాళ తలపెట్టిన చలో ఆత్మకూరు యాత్రను అడ్డుకోవడంలో ప్రభుత్వం సఫలమైంది. పార్టీ అధినేత చంద్రబాబుతో సహా.. ముఖ్యనేతలందరినీ ఎక్కడికక్కడే నిర్బంధించింది. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతంలో తెదేపా కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని.. కార్యకర్తలను గ్రామాల్లో నుంచి వెళ్లగొట్టారని టీడీపీ చెబుతోంది. వైకాపా దాడుల బాధితులతో గుంటూరులో శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ బాధితులను స్వగ్రామమైన ఆత్మకూరుకు తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు సమాయత్తమయ్యారు. చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు సహా.. అందరూ ఆత్మకూరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా.. తెదేపా తలపెట్టిన యాత్రకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం.. నిన్న అర్థరాత్రి నుంచే నాయకులను ఇళ్లలో నిర్బంధించింది.
చలో ఆత్మకూరుకు విఫలయత్నం... చంద్రబాబు దిగ్బంధం
వైకాపా దాడులకు గురైన బాధితులతో తెలుగుదేశం పార్టీ నిర్వహించ తలపెట్టిన చలో ఆత్మకూరు భగ్నమైంది. తెదేపా నేతలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిర్బంధించిన ప్రభుత్వం యాత్రను అడ్డుకోవడంలో సఫలమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను దిగ్బంధించారు. చంద్రబాబు ఇంటి నుంచి బయటకు రాకుండా గేట్లను తాళ్లతో కట్టేశారు.
చంద్రబాబు ఇంటి చుట్టూ గోడకట్టి.. తాళ్లతో గేట్లను కట్టి..
నిన్న అర్థరాత్రి నుంచే నాయకులను అడ్డుకునే వ్యూహాన్ని అమలు చేసిన పోలీసులు ఇవాళ ఎవరినీ బయటకు రానివ్వలేదు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసం వద్దకు వచ్చిన పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11గంటల సమయంలో ఎలాగైనా ఆత్మకూరు వెళతానంటూ.. చంద్రబాబు బయలుదేరగా అడ్డుకున్నారు. ఇంటి గేట్లను తాళ్లతో కట్టివేశారు. అంతకుముందు పోలీసులు ఆత్మకూరు బయలుదేరిన తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కూడా అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల తెదేపా నాయకులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.
ఆత్మకూరు వెళ్లితీరతా: చంద్రబాబు
తనను అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతల అరెస్టును తీవ్రంగా ఖండించారు. గృహ నిర్బంధంతో తెదేపాను అడ్డుకోలేరని చెప్పారు. చలో ఆత్మకూరు జరిగి తీరుతుందని తెలిపారు.