ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కాలంలో సెల్​ఫోన్​కు చేరువై.. మాటలకు తడబడుతున్న చిన్నారులు

Cell Phone Impact on Children: కరోనా వచ్చిన సమయంలో ప్రపంచంలో పరిస్థితులు దారుణంగా మారాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లు లేక.. ఆటలు లేక.. ఎక్కువ సమయం ఫోన్లో గడపడం వల్ల మానసిక ఎదుగుదల ఎక్కువగా లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల నేడు వెరసి, స్పీచ్‌ థెరపిస్టులకు డిమాండ్‌ పెరిగింది.

Cell Phone Impact on Children
Cell Phone Impact on Children

By

Published : Apr 9, 2023, 5:21 PM IST

Cell Phone Impact on Children: కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు, లాక్‌డౌన్‌ సమయంలో పుట్టిన శిశువులు వారి వయసుకు తగ్గట్లు మాట్లాడలేకపోతున్నారు. కొవిడ్‌ కాలంలో పిల్లలు తమలోని సహజమైన చురుకుదనాన్ని ప్రదర్శించే అవకాశం కోల్పోయారు. తోటి చిన్నారులతో.. ఆటపాటలు, బంధువులతో అనుబంధాలకు దూరమై, సెల్‌ఫోన్‌లకు చేరువయ్యారు. ఆ ప్రభావం వారి మానసిక ఎదుగుదలపై కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. తమ పిల్లలకు మాటలు సరిగ్గా రావడం లేదంటూ.. తల్లిదండ్రులు ఆసుపత్రుల్లో సంప్రదిస్తున్న కేసులు పెరిగాయి. విశాఖ కేజీహెచ్‌లోని చిన్నపిల్లల మానసిక విభాగానికి ఇలాంటి కేసులు వారానికి 20 వరకు వస్తున్నాయి. తొలుత మాట్లాడిన చిన్నారులు సైతం సెల్‌ఫోన్‌లకు అలవాటుపడి ఇప్పుడు సరిగ్గా పదాలు పలకలేకపోతున్నట్లు.. మంగళగిరి ఎయిమ్స్‌కు వచ్చిన కొన్ని కేసుల్లో తేలింది. వెరసి, స్పీచ్‌ థెరపిస్టులకు డిమాండ్‌ పెరిగింది.

నర్సరీలో చేర్చాల్సిన వయసులో స్పీచ్‌థెరపిస్టుల వద్దకు..కొవిడ్‌కు రెండేళ్ల ముందు, కొవిడ్‌ సమయంలో పుట్టిన చిన్నారుల వయసు.. ప్రస్తుతం 3-5 ఏళ్ల మధ్య ఉంది. వీరి చిరుప్రాయం దీర్ఘకాలిక లాక్‌డౌన్‌, ఆంక్షల నడుమ ప్రారంభమైంది. వీరిలో శారీరక ఎదుగుదల పరంగా సమస్య లేకపోయినా.. కొందరిలో సహజసిద్ధమైన మానసిక పరిణతి తక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మాటలు రాకపోవడం.. స్పందించకపోవడం వంటి లోపాలను గమనించిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదిస్తున్నారు. ప్లే స్కూల్లోనో, నర్సరీలోనో చేర్చాల్సిన వయసులో స్పీచ్‌థెరపిస్టుల వద్దకు తీసుకువెళ్తున్నారు. ‘మా అబ్బాయిలో ఆటిజం లక్షణాలేమీ లేవు. కానీ వయసుకు తగ్గట్లు మాట్లాడలేకపోతున్నాడు. కొవిడ్‌ సమయంలో బయటకు వెళ్లలేకపోయాం. మా ఇంటికి ఎవరూ రాలేదు. మూడేళ్లు దాటినా ఎల్‌కేజీలో చేర్పించలేదు. ఇప్పుడు వాడికి మాటలు నేర్పించడమే మాకు పనిగా మారింది’ అని విజయవాడకు చెందిన ఓ చిన్నారి తండ్రి చెప్పారు. విజయవాడ జీజీహెచ్‌లో పనిచేసే డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్‌ సైకాలజిస్ట్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ‘కొవిడ్‌ వల్ల ‘వన్‌వే కమ్యూనికేషన్‌’ పెరిగి పిల్లల్లో మాటలు మందగించాయి. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాల్లో సమస్య తీవ్రంగా ఉంది’ అని తెలిపారు. ‘వారసత్వాన్ని బట్టి ఆలస్యంగానైనా మాట్లాడతారులే అనుకోవద్దు. మేం అలాగే వేచిచూసి ఇబ్బందిపడ్డాం. వైద్యులను సంప్రదించాలి’ అని గుంటూరుకు చెందిన తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ఏడాదికే తొలి పలుకులు పలకాలి..సాధారణంగా శిశువులు ఏడాది వయసులో ముద్దుముద్దుగా మాట్లాడటం ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల పిలుపునకు బదులివ్వడం, నవ్వడం, వారికి కావాల్సిన వస్తువులను చూపించడం ద్వారా స్పందిస్తారు. ఇంట్లోవాళ్లతో కలిసిపోతుంటారు. కరోనా ఈ అనుభూతులను దూరంచేసింది. లాక్‌డౌన్‌లో రాకపోకలు లేకపోవడం, ఇతరులతో కలవలేకపోవడం వల్ల ఒంటరితనం పెరిగిపోయింది. అప్పుడే తల్లిదండ్రులు అయిష్టంగానైనా పిల్లల చేతికి సెల్‌ఫోన్‌ ఇవ్వాల్సి వచ్చేది. తొలుత రైమ్స్‌, కార్టూన్స్‌తో మొదలైన అలవాటు.. క్రమంగా వ్యసనంలా మారింది. ఇతరులతో మాట్లాడకపోవడం, పిలిచినా పలకకపోవడం, వారి ఉనికినే గమనించకపోవడం వంటి లక్షణాలు బయటపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘తొలి ఐదేళ్లలో పిల్లల మెదడు గరిష్ఠంగా వృద్ధి చెందుతుంది. ఇందుకు మంచి ఆహారమే కాదు, సరైన ప్రేరణ కూడా కావాలి. తల్లిదండ్రులు నిరంతరం వారితో మాట్లాడుతుండాలి. ప్రముఖ జర్నల్‌ ‘జామా’లో ప్రచురితమైన పీడియాట్రిక్స్‌ పరిశోధన వ్యాసం స్క్రీన్‌ (తెర) పిల్లల మానసిక పరిణతిని ఎలా ప్రభావితం చేస్తుందో వెల్లడించింది’ అని వైద్యులు పేర్కొన్నారు.

పిల్లలతో తల్లిదండ్రులు రన్నింగ్‌ కామెంట్రీలా మాట్లాడుతుండాల్సిందే. మా చికిత్సలో ఇదో విధానం. సెల్‌ఫోన్‌కు బానిసలైన పిల్లలు మాట్లాడేవారి వైపు చూడరు. ఒకే పనిని చేస్తుంటారు. ఒకే రకం వస్తువులను తిప్పుతుంటారు. కొత్తవి అంగీకరించరు. మంకుపట్టుతో మారాం చేస్తుంటారు. ఈ లక్షణాలు ఆటిజానికి దారితీస్తాయి. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువసేపు గడపాలి. బొమ్మలపుస్తకాలు చూపించి, ప్రశ్నలడిగి, ప్రతిస్పందన రాబట్టాలి. స్మార్ట్‌ఫోన్లు, ఇతర స్క్రీన్‌ గాడ్జెట్లకు అలవాటు పడ్డప్పుడు, వాటిని దూరంచేస్తే తట్టుకోలేరు. పెయింటింగ్‌, అవుట్‌డోర్‌ గేమ్‌లపై నిమగ్నమయ్యేలా చేయాలి.- ప్రొఫెసర్‌ ప్రసన్నకుమార్‌, చిన్నపిల్లల మానసిక వైద్య నిపుణులు, కేజీహెచ్‌, విశాఖ

పిల్లల్లో వచ్చే మాటలూ కొవిడ్‌ వల్ల ఆగిపోయాయి. స్పీచ్‌ థెరపీ శిక్షణతో మాట్లాడగలిగారు. ఐదారు శాతం మందిలో స్పీచ్‌ సమస్య ఉంటే ఇప్పుడిది 10-12 శాతానికి పెరిగింది. ప్రపంచ సైకియాట్రిక్‌ సొసైటీ, అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సైకియాట్రిక్స్‌, ఇతర ప్రముఖ సైకియాట్రిక్‌ సంస్థల సూచన ప్రకారం రెండేళ్ల వయసు వరకు పిల్లలను సెల్‌ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచాలి. పరిసరాల పరిశీలనతోనే బాల్యంలో మెదడు చురుకుదనం పెరుగుతుంది.-డాక్టర్‌ విజయచంద్రారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, ఎయిమ్స్‌, మంగళగిరి

ఇవి చదవండి:

ABOUT THE AUTHOR

...view details