మీడియాపై దాడి కేసులో అరెస్టైన ఆరుగురు రాజధాని రైతులు.. షరతులతో కూడిన బెయిల్పై విడుదల అయ్యారు. గుంటూరు జిల్లా జైల్ నుంచి విడుదలైన రైతులకు అమరావతి పరిరక్షణ సమితి, పొలిటికల్ జేఏసీ సభ్యులు, రైతులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. జై అమరావతి... జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి రైతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. రాజధాని కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి భూములు ఇచ్చిన తమని పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించారని వాపోయారు. రాజధానిని అమరావతిలొ కొనసాగించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తమ ప్రాణాలు అర్పించైనా రాజధానిని కాపాడుకుంటామని వివరించారు.