గుంటూరు జిల్లాలో బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా ప్రభుత్వం అందించే రాయితీ సరకులు నేటికీ లబ్ధిదారుల చెంతకు చేరలేదు. గత నెలలో మాదిరిగా కాకుండా ప్రభుత్వం ఈ నెల నుంచి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేపట్టింది. ఆది నుంచి ఈ పంపిణీకి ఇబ్బందులు తప్పలేదు. ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఫలితంగా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న రేషన్ సరకులు లబ్ధిదారులకు చేరేందుకు మరింత ఆలస్యమవుతోంది.
●జిల్లాలో 14,64,126 బియ్యం కార్డులున్నాయి. గత నెలలో డీలర్ల ద్వారా పంపిణీ చేయగా 15వ తేదీ నాటికి 78.98 శాతం పూర్తయింది. ఈ నెలలో తొలుత పట్టణ ప్రాంతాల్లో ఎండీయూ(మొబైల్ డిస్పెన్సరీ యూనిట్) ద్వారా పంపిణీ చేపట్టారు. ఆది నుంచి సాంకేతిక సమస్యతో పంపిణీ వేగం పుంజుకోలేదు. డీలరు వద్ద నుంచి సరకులు తీసుకుంటే వాహనంలోకి చేర్చాల్సింది ఎవరనేది స్పష్టత రాలేదు. దీంతో కొన్ని రోజులు ఈ ప్రక్రియ నెమ్మదించింది. జిల్లాలోని 13 పట్టణ ప్రాంతాల్లో సుమారుగా 4 లక్షల బియ్యం కార్డులున్నాయి. కానీ ఈ నెల 14వ తేదీ వరకు 2,46,800 కార్డులకు మాత్రమే రేషన్ సరకులు అందాయి. 15వ తేదీ నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రారంభించగా.. ఇప్పటి వరకు 3,70,163 కార్డుదారులకు (25.28 శాతం) మాత్రమే సరకులు పంపిణీ చేశారు.
- తూకం యంత్రంతోనే సమస్య