Balakrishna Birthday celebrations: రాష్ట్ర వ్యాప్తంగా సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 63వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో కూడా నందమూరి నటసింహం బర్త్డే ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ శ్రీవారికి ఆలయ ఆఖిలాండం వద్ద 630 కొబ్బరి కాయలు, రెండు కేజీల కర్పూరం సమర్పించారు. నందమూరి బాలకృష్ణ ఆయురారోగ్యాలతో జీవించి ప్రజా సేవలో ముందుకు వెళ్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు కొలాహలంగా సాగాయి. టీడీపీ నగర ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. తొలిసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో పాటు మాజీ మంత్రులు, టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, బీదా రవిచంద్ర, బీసీ జనార్దన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిమానులకు కోలాహలం నడుమ కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు, బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ రాణిస్తున్న బాలకృష్ణ రియల్ హీరోగా ప్రజల గుండెల్లో ఉన్నారని ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు కొనియాడారు.
కాగా నగరంలోని ఏసీ స్టేడియంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కూడా.. బాలకృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం ముదిరాజులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్టేడియంలో కేక్ కట్ చేసి, క్రీడాకారులకు మిఠాయిలు పంచి, బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయంగానూ రాణిస్తున్న బాలకృష్ణ.. ఎన్టీఆర్ బాటలోనే నడుస్తున్నారని ఈ సందర్భంగా పలువురు ఆయనను కొనియాడారు.
ప్రకాశం జిల్లాలో..
మరోవైపు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యలయంలో తెలుగు యువత జిల్లా నాయకులు షేక్ వలి ఆధ్వర్యంలో బాలయ్యబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా నియోజకవర్గ ఇంఛార్జ్ గుడూరి ఏరీక్షన్ బాబు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. తన నటన ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారని బాలకృష్ణను కొనియాడారు.
వైఎస్సార్ కడప జిల్లాలో..
ఈ క్రమంలో బాలయ్యబాబు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా మూడు పాత్రలను పోషిస్తున్నారని కడప జిల్లా బాలకృష్ణ అభిమానం సంఘం అధ్యక్షుడు పీరయ్య అన్నారు. నందమూరి బాలకృష్ణ 63వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కడప వైఎస్సార్ సినిమా థియేటర్లో 63 కిలోల భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు హాజరై కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై బాలయ్య అంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానులకు కేక్ పంపిణీ చేశారు.