Chandrababu and Lokesh fired on CM Jagan: కాకినాడకు చెందిన ఆరుద్ర విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకింత నిర్దయగా వ్యవహరిస్తోందనితెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక బాధిత మహిళ కష్టం తీర్చలేని విధంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు తయారయ్యాయని నిలదీశారు. బిడ్డ వైద్యం కోసం ఆ తల్లి చేస్తున్న పోరాటాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మీ ఆరోగ్య శ్రీ పథకం ఏమైందని ప్రశ్నించారు. ఒక మహిళ చేస్తున్న పోరాటానికి వైఎస్ జగన్ స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
న్యాయం కోరుతూ ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన మహిళ సమస్యను ఏడాది కాలంగా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదంటారా.. పైగా పిచ్చాసుపత్రికి తరలిస్తారా అని దుయ్యబట్టారు. అసలు ఆమె డిప్రెషన్లోకి వెళ్లడానికి కారణం ఎవరని నిలదీశారు. ఆమెను చివరికి ఏం చేయబోతున్నారని అన్నారు. వెంటనే ఆరుద్ర సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ఆమె కుటుంబానికి తగిన సాయం అందించాలని కోరారు.
అధికార మదం దింపే రోజు దగ్గరలోనే ఉంది..లండన్ మందులు వాడే పిచ్చోడు జగన్ కళ్లకు అందరూ పిచ్చోళ్ళ లానే కనిపిస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. కుమార్తెని కాపాడుకోవడానికి పోరాడుతున్న మహిళ ఆరుద్రపై పిచ్చి ముద్ర వేయడం సైకో పాలనకి పరాకాష్టగా పేర్కొన్నారు. మాస్క్ అడిగిన దళిత మేధావి డాక్టర్ సుధాకర్‌ని ఇలాగే పిచ్చోడిని చేసి చంపేశారు సైకో సీఎం.. అధికార మదం దింపే రోజు దగ్గరలోనే ఉందని లోకేశ్ హెచ్చరించారు.
ఇదీ జరిగింది: తన బిడ్డను కాపాడుకోవడానికి న్యాయపోరాటం చేస్తున్న కాకినాడ గ్రామీణం రాయుడుపాలేనికి చెందిన రాజులపూడి ఆరుద్రమానసిక స్థితి బాగోలేదంటూ పోలీసు బందోబస్తు మధ్య విశాఖలోని మానసిక వైద్యశాలకు తరలించారు. ఆమె మానసిక పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నించిన అక్కడి వైద్యులు.. మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మీ చంద్రకు వెన్నెముక చికిత్స చేయించాల్సి ఉందని కోరడంతో డిశ్చార్జి చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం తల్లీకూతుళ్లు విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
ఆరుద్ర తన కుమార్తెతో కలిసి ఇటీవల కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యను విన్నవించారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో.. ఈ నెల 7న కలెక్టర్ కార్యాలయం ఎదుటే కుమార్తెతో సహా నిరవధిక దీక్షకు దిగారు. దీంతోపోలీసులు ఆ రోజు అర్ధరాత్రి దాటాక దీక్షను భగ్నం చేసి తల్లీకూతుళ్లను కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. చికిత్సకు వారు సహకరించకపోవడంతో బలవంతపు వైద్యసేవలకు యత్నించగా.. ఒత్తిడి చేస్తే గొంతు కోసుకుంటానని ఆరుద్ర హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు.