Several crimes across the state: ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గంగంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లనిచ్చిన మామ ఆస్తి పంచి ఇవ్వలేదని ఆర్మీ ఉద్యోగి సుధాకర్ రెడ్డి (38) అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంటల్లో కాలిపోయిన సుధాకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం ఢిల్లీలో పని చేస్తున్న సుధాకర్ రెడ్డి సెలవుపై ఇటీవల ఇంటికి వచ్చాడు. మామకు సుధాకర్‌కు ఆస్తి విషయంలో వాగ్వాదం జరగగా.. మనస్థాపంతో బుధవారం అర్ధరాత్రి సుధాకర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సుధాకర్ రెడ్డి మృతిపై అతని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
యువకుడ్ని దారుణంగా హత్య చేసిన దుండగులు.. యువకుడ్ని దారుణంగా హత్య.. పాత కక్షలు నేపథ్యంలో ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. పాండురంగ పేటకు చెందిన మట్టే ప్రశాంత్.. రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి వెంటపడి కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ప్రశాంత్‌పై గతంలో పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ ఉన్నందున పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓ హత్యకేసులో తమ కుమారుడి పేరు ఉన్నందున తమకు పలుమార్లు బెదిరింపులు వచ్చాయని ప్రశాంత్ తల్లి తెలిపారు. హత్యచేసిన వారిని శిక్షించాలని ఆమె కోరారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలో రేణిగుంట- నాయుడుపేట ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా దంతాలపల్లికి చెందిన వెంకటమ్మ(65) ఆమె ముగ్గురు కుమారులు అశోక్ (45), దినేష్ (42), రాంబాబు(40)తోపాటు మనవరాళ్లు శాన్వితాక్షరి(06), బాన్వితాక్షరి(10)లు.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. నిద్రమత్తులో ఆర్టీసీ బస్సును కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ఘటనలో వెంకటమ్మ, అశోక్, శాన్వితాక్షరి అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏర్పేడు సీఐ శ్రీహరి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.