ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నయాఖిల్లా కింద మరో నగరం ఉండేదా..? - నయాఖిల్లా కింద నగరం ఉండేదా?

గోల్కొండ సమీపంలోని నయాఖిల్లా ప్రాంతం అడుగున మరో నగరం ఉండేదని పురావస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తవ్వకాల్లో కట్టడాల అవశేషాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం రెండు అడుగుల లోతులోనే అనేక ఆనవాళ్లు బయటపడుతున్నాయి.

నయాఖిల్లా కింద మరో నగరం ఉండేదా..?
నయాఖిల్లా కింద మరో నగరం ఉండేదా..?

By

Published : Dec 15, 2019, 9:59 AM IST

Updated : Dec 15, 2019, 10:12 AM IST

విభిన్న చారిత్రక నిర్మాణాలకు నెలవైన గోల్కొండ కోట సమీపంలోని నయాఖిల్లా ప్రాంతం అడుగున మరో నగరం ఉండేదా..? అంటే అవుననే అంటున్నారు పురావస్తు నిపుణులు. ప్రస్తుత తవ్వకాల్లో బయటపడ్డ అవశేషాలను పరిశీలిస్తే అలాగే అనిపిస్తోందని చెబుతున్నారు. తాజాగా ఇక్కడ రెండు అడుగుల మేర తవ్వగానే.. పలు ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి.

గోల్కొండ కోటకు కిలోమీటరు దూరంలో ఉన్న నయా ఖిల్లా కూడా చారిత్రక నిర్మాణాలకు వేదికగా నిలుస్తోంది. ఇక్కడ దాదాపు 500 ఏళ్ల నాటి బూరుగు వృక్షం, ముల్లాఖయాలీ, ముస్తఫాఖాన్‌ మసీదులు ఇప్పటికీ ఉన్నాయి. గతంలో మొఘల్‌గార్డెన్‌ ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. మొఘల్‌గార్డెన్‌ ఉండేదని చెప్పుకొనే ప్రదేశంలోనే కేంద్ర పురావస్తు శాఖ అధికారులు గత పదిరోజులుగా తవ్వకాలు జరుపుతుండగా.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.

రెండు అడుగుల లోతులోనే అనేక ఆనవాళ్లు...

నయా ఖిల్లా దగ్గర దాదాపు 50 నుంచి 70 వరకు గుంతలను రెండు అడుగుల లోతు వరకు తవ్వారు. ఈ సందర్భంగా పెద్దపెద్ద రాళ్లతో కట్టిన నిర్మాణాలు బయటపడుతున్నాయి. ఓ చోట దాదాపు అర కిలోమీటరు మేర బండరాళ్ల వరుస బయటపడింది. గది లాంటి నిర్మాణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న స్థలం కుడివైపున కూడా మరిన్ని తవ్వకాలు జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు అడుగుల లోతులో తవ్వితేనే ఇలాంటి నిర్మాణాలు వెలుగుచూస్తే.. అదే పది, పన్నెండు అడుగుల మేర తవ్వితే మరిన్ని భారీ నిర్మాణాలు బయటపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నయాఖిల్లా కింద మరో నగరం ఉండేదా..?

గతంలోనూ తవ్వకాలు..

గతంలో ఇక్కడ రెండు సార్లు తవ్వకాలు జరిపిన పురావస్తు శాఖ అధికారులు ప్రస్తుతం మూడోసారి జరుపుతున్నారు. గతంలో నీటి ట్యాంకులు, ఫౌంటేన్‌, డ్రైనేజీ వ్యవస్థ, పైప్‌లైన్లు, హుక్కా సేవించే పరికరాలు, మొఘల్‌ కాలం నాటి నాణేలు బయటపడ్డాయి. వాటినిబట్టి కుతుబ్‌షాహీల కాలంలో ఈ ప్రాంతంలో మొఘల్‌ గార్డెన్‌ ఆనవాళ్లు ఉండేవని పురావస్తు నిపుణులు అప్పట్లో అంచనా వేశారు.

ఇవీ చూడండి:ఇంటింటికీ పెరటి కోళ్లు... ఎందుకంటే...

Last Updated : Dec 15, 2019, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details