ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మింగ మెతుకు లేదు కానీ.. రూ. 15.77 కోట్లతో 19 వాహనాల కొనుగోలు..

NEW TOYOTA FORTUNER VEHICLES : అసలే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఆచితూచి అడుగేయాల్సిన సమయంలో వృథా ప్రయాసలకు పోయి అధిక మొత్తంలో వెచ్చిస్తున్నారు. తాజాగా పోలీసులు కొత్తగా 19 టయోటా ఫార్చ్యూనర్‌ వాహనాలను కొనుగోలు చేశారు. మొత్తంగా ఈ వాహనాలకు రూ.15.77 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో తాజాగా భారీ మొత్తం వెచ్చించి కొత్త వాహనాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

new Toyota Fortuner vehicles
new Toyota Fortuner vehicles

By

Published : Jan 3, 2023, 1:27 PM IST

NEW TOYOTA VEHICLES : అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. ఉన్న అప్పులు చాలవన్నట్లు పోలీసులు కొత్తగా 19 టయోటా ఫార్చ్యూనర్‌ వాహనాలను కొనుగోలు చేశారు. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ) అధికారులు సోమవారం వీటిని పరీక్షించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీటిలో 17 వాహనాలు నలుపు, 2 వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి. వీవీఐపీల భద్రతకు వీలుగా వీటిని బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్చటానికి పంపించనున్నారు.

ఈ వాహనాలు ఎవరి కోసం కొనుగోలు చేశారనే దానిపై పూర్తి గోప్యత పాటిస్తున్నారు. సీఎం జగన్‌ కోసమే కొన్నారన్న ప్రచారం జరుగుతోంది. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన కోసం ప్రభుత్వం కొత్తగా 6 నల్ల రంగు టయోటా ఫార్చ్యూనర్‌ వాహనాలను కొనుగోలు చేసింది. 2019 జూన్‌ 17 నుంచి వీటిని వినియోగిస్తున్నారు. ఆ ఆరు వాహనాలకు అప్పట్లో రూ.5 కోట్లు అయి ఉంటుందని అంచనా.

తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి, సచివాలయం, అసెంబ్లీకి వెళ్లి వచ్చేందుకు, విజయవాడ, గుంటూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు వీటిని వినియోగించారు. ఇప్పటివరకూ 10వేల నుంచి 15వేల కిలోమీటర్లకు మించి తిరిగి ఉండవని అంచనా. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో తాజాగా భారీ మొత్తం వెచ్చించి కొత్త వాహనాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 25 మంది మంత్రులున్నారు. కొనుగోలు చేసినవి 19 వాహనాలే. వారి కోసం కాకపోవొచ్చనే వాదన వినిపిస్తోంది.

వ్యయం రూ.15.77 కోట్లు!: ప్రస్తుతం హై ఎండ్‌ టయోటా ఫార్చ్యూనర్‌ వాహనం (డీజీల్‌ వెర్షన్‌) ఒక్కో దాని ఆన్‌రోడ్‌ ధర రూ.63 లక్షల వరకూ ఉంది. అదే పెట్రోల్‌ వెర్షన్‌ అయితే రూ.43 లక్షల వరకూ ఉంది. సాధారణంగా వీవీపీఐల కోసం అత్యాధునిక హై ఎండ్‌ వాహనాలనే కొనుగోలు చేస్తారు. ఇప్పుడు హై ఎండ్‌ టయోటా డీజిల్‌ వెర్షన్‌ 19 వాహనాలకు రూ.11.97 కోట్లు, వాటిని బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్చడానికి అదనంగా సుమారు రూ.20 లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా. అంటే రూ.3.80 కోట్లు. మొత్తంగా ఈ వాహనాలకు రూ.15.77 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details