ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న వీర బాదుడు మామూలుగా లేదుగా - సామాన్యుడి గుండె గుభేల్​!

AP People Suffer with High Taxes in YSRCP Govt: పేదల పక్షపాతినంటారు. పేద జనోద్ధరణే లక్ష్యమంటారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధంలో తాను పేదల పక్షం వహిస్తున్నానంటూ ఊదరగొడతారు. పేదల గురించి ఇంతగా డప్పు కొట్టే సీఎం జగన్‌ వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. సామాన్యుల నడ్డివిరచడమే అజెండాగా జగన్‌ పాలన సాగుతోంది. సంక్షేమ పథకాల అమలు కోసమంటూ లక్షల కోట్లు అప్పులు చేస్తూనే రకరకాల పన్నుల పేరిట బడుగుజీవులపై వైఎస్సార్​సీపీ సర్కార్ పెనుభారం మోపుతోంది. అసమర్థ సర్కారు తీరుతో ఉపాధి కరవై, బతుకు భారమై అల్లాడుతున్న పేదలపై ఛార్జీలు, పన్నుల పెంపుతో అదనంగా లక్ష కోట్లకుపైగా వాత పెట్టేసింది. ఇందులో కరెంటు, మద్యం, డీజిల్, పెట్రోలు, రేషన్‌ సరుకుల ధరల భారమే 83వేల 780 కోట్లకు పైగా ఉంది.

AP_People_Suffer_with_High_Taxes_in_YSRCP_Govt
AP_People_Suffer_with_High_Taxes_in_YSRCP_Govt

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 7:26 AM IST

AP People Suffer with High Taxes in YSRCP Govt: జగనన్న వీర బాదుడు మామూలుగా లేదుగా - సామాన్యుడి గుండె గుభేల్​!

AP People Suffer with High Taxes in YSRCP Govt: 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ భారీగా విమర్శలు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో అసలైన వీరబాదుడంటే ఏంటో జనానికి బాగా రుచి చూపించారు. పెట్రోల్, డీజిల్, ఆస్తిపన్ను, ఆర్టీసీ, కరెంటు ఛార్జీలు, ఇసుక ధరలు, వాహనాల పన్ను ఇలా దేన్నీ వదల్లేదు. ఇప్పటి వరకు పెంచిన పన్నుల్ని, ఛార్జీల్ని బట్టి లెక్కవేస్తే 2024 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే వరకు ప్రజలపై పడే భారం లక్షా 8 వేల కోట్లకు చేరుతుందని అంచనా.

విద్యుత్‌ ఛార్జీల మోత:వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ ఛార్జీల పెంపు (Electricity Charges Hike), ట్రూఅప్, సర్దుబాటు ఛార్జీల పేరుతో భారీగా బాదేసింది. ఇప్పుడు స్మార్ట్‌ మీటర్ల ఖర్చూ ప్రజల నెత్తిన రుద్దబోతోంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రజలపై వేసిన, వేయబోతున్న భారం సుమారు 24 వేల 8 వందల 56 కోట్లని అంచనా. 2021 ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా కనీస విద్యుత్‌ వినియోగ ఛార్జీల్ని వసూలు చేస్తున్న ప్రభుత్వం ఏటా 200 కోట్ల చొప్పున 600 కోట్లు వసూలు చేయనుంది. 2022 ఏప్రిల్‌లో విద్యుత్‌ ఛార్జీలు పెంచి ఏటా 14 వందల కోట్ల అదనపు భారం మోపింది. దీనివల్ల ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలపై పడే అదనపు భారం 2వేల 800 కోట్లు.

2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో వినియోగించుకున్న విద్యుత్‌కి మూడు డిస్కంల పరిధిలో ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో 2వేల 9 వందల 10 కోట్ల 10 లక్షలు వసూలు చేస్తోంది. పరిశ్రమలకు ప్రతి యూనిట్‌ విద్యుత్‌కు 6 పైసలుగా ఉన్న విద్యుత్‌ సుంకాన్ని 2022 మే నుంచి రూపాయికి పెంచింది. ఏటా 2వేల 600 కోట్ల అదనపు భారం పడనుంది. అంటే ఈ ప్రభుత్వ హయాంలో పడే మొత్తం అదనపు భారం సుమారు 5 వేల కోట్లకు పైనే.

కొత్త కనెక్షన్‌ తీసుకునే వినియోగదారులపై అభివృద్ధి ఛార్జీల పేరిట డిస్కంలు అదనపు భారం మోపాయి. ఏటా 7 నుంచి 8 కోట్ల భారం పడుతుందని అంచనా. గృహ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు అమర్చేందుకు సుమారు 13 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. అందులో 6 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇవ్వనుంది. మిగతా 7 వేల కోట్లు ప్రజల నుంచే వసూలు చేస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 2024 మే వరకు ట్రూఅప్‌ ఛార్జీల రూపంలో 3వేల 82 కోట్ల 99 లక్షలు వసూలు చేస్తుంది.

APSRTC Bus Charges Hike: ఏపీఆర్టీసీలో రాయితీల కోత.. ప్రయాణికులపై ఛార్జీల మోత..

పెట్రోలు, డీజిలుపై బాదుడు: పెట్రోల్, డీజిల‌్‌పై జగన్‌ ప్రభుత్వం 19వేల 880 కోట్లు పిండేస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకి 2గా ఉన్న అదనపు వ్యాట్‌ని 4 రూపాయలకు పెంచడమే కాకుండా, రోడ్డు డెవలప్‌మెంట్‌ సెస్‌ పేరుతో లీటరుపై మరో రూపాయి అదనంగా వడ్డించింది. మొత్తంగా ఈ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో వచ్చే మొత్తం ఆదాయం సుమారు 65వేల 850 కోట్లు. ప్రజలపై పడిన అదనపు భారం సుమారు 19వేల 880 కోట్లని అంచనా. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 అక్టోబర్‌, 2020 మేలో మద్యం ధరలు పెంచింది. దీంతో ఈ ప్రభుత్వ హయాంలో మద్యం ప్రియులపై సుమారు 34 వేల కోట్ల భారం పడుతోంది.

రేషన్‌ సరకుల్లో భారం:రేషన్‌ దుకాణాల్లో తెల్లకార్డుదారులకు ఇచ్చే కందిపప్పులో ప్రభుత్వం సగానికి సగం కోత పెట్టడమే కాకుండా ధర కూడా పెంచేసింది. పంచదార ధరనూ పెంచింది. 2020 జూన్‌కి ముందు కిలో కందిపప్పు ధర 40 రూపాయలు ఉంటే, ఆ ఏడాది జులై నుంచి 67కి పెంచింది. అంతకుముందు నెలకు 2 కిలోల కందిపప్పు ఇస్తుండగా, దానిని కిలోకి కుదించింది. రాష్ట్రంలో కోటీ 45 లక్షల మంది తెల్ల రేషన్‌కార్డుదారులు ఉండగా, వారిలో ప్రతి నెలా 85 శాతం మందే రేషన్‌ తీసుకుంటారని అనుకున్నా దాని ప్రకారం కోటీ 23 లక్షల మంది అవుతారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు 180 రూపాయల వరకు ఉంది.

జగన్ ప్రభుత్వం కందిపప్పుని సగానికి కుదించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కో కిలో ధర సగటున 110 వేసుకున్నా ఏటా కోటీ 23 లక్షల కిలోల కందిపప్పుకి నాలుగేళ్ల కాలానికి ప్రజలపై పడే భారం 6వేల 494 కోట్లు. కందిపప్పు ధర పెంచడం వల్ల నెలకు కిలోకి 27 రూపాయల చొప్పున నాలుగేళ్లలో కోటీ 23 లక్షల మంది లబ్ధిదారులపై 15 వందల 94 కోట్ల రూపాయలు అదనపు భారం పడునుంది. 2020 జూన్‌ వరకు 10 రూపాయలుగా ఉన్న అర కిలో పంచదార ధరను ఆ తర్వాత నుంచి 17కి పెంచేశారు. దీని వల్ల లబ్ధిదారులపై సంవత్సరానికి 103 కోట్ల 50 లక్షల అదనపు భారం పడింది. నాలుగేళ్లలో సుమారు 414 కోట్ల అదనపు భారం పడుతోంది.

ఆస్తిపన్ను మోత: జగన్‌ ప్రభుత్వం ఆస్తిపన్నునూ అడ్డగోలుగా పెంచేసి ప్రజల నడ్డి విరిచింది. అద్దె ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేసి ఆస్తి మూలధన విలువను బట్టి పన్ను వేసే విధానం అమల్లోకి తెచ్చింది. మూలధన విలువ ప్రకారం పన్ను మదింపు చేసి, దాన్ని చేరుకునేంత వరకు ఏటా 15 శాతం చొప్పున పెంచుతూ వెళ్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వచ్చిన కొత్త విధానంతో 2024-25కి సంబంధించిన ఆస్తిపన్ను డిమాండ్‌తో కలిపి పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను వాత సుమారు 950 కోట్ల రూపాయలు పడనుంది. వైసీపీ ప్రభుత్వం చెత్తపన్నుతోనూ ప్రజల్ని బాదేస్తోంది. 2024 ఏప్రిల్‌ వరకు ప్రజలపై సుమారు 400 కోట్ల రూపాయల భారం పడుతోంది.

industries incentives గతేడాది రాయితీలు లేవు..! ఈసారైన బటన్ నొక్కుతారని ఎదురు చూస్తున్న పారిశ్రామిక వేత్తలు!

పేదలపై ఓటీఎస్‌ పిడుగు: వైఎస్సార్​సీపీ ప్రభుత్వం పేదల్నీ వదల్లేదు. ఎప్పుడో 1983లో ఎన్టీఆర్ హయాం నుంచి 2011 వరకు ప్రభుత్వాలు వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఇళ్లను, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ రుణ సాయంతో నిర్మించకున్నవారు ఇప్పుడు O.T.S. కింద నిర్దేశిత రుసుము కడితే రిజిస్ట్రేషన్ చేస్తామని 2021 అక్టోబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు, పట్ణణాల్లో 15 వేలు, నగరాల్లో 20 వేల రూపాయల చొప్పున కట్టాలని చెప్పింది.

ఆ తర్వాత పట్టణ, నగర ప్రాంతాల్లోనూ 10 వేలకు తగ్గించింది. గత ప్రభుత్వాల హయాంలో కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు డబ్బు చెల్లించడమేంటని లబ్ధిదారులు ఎదురుతిరగడంతో 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం వసూళ్లు ఆపేసింది. అలాగని O.T.S.ను రద్దు చేస్తున్నట్లుగాను ప్రకటించలేదు. అంటే పేదల మెడపై ఇంకా కత్తి వేలాడతున్నట్లే. రుణం తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నవారి సంఖ్య 39 లక్షలుగా ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. వారందరి నుంచి 10 వేల చొప్పున వసూలు చేస్తే 3 వేల 900 కోట్ల భారం మోపినట్లవుతుంది.

కొత్త వాహనం కొనాలంటే గుండె గుభేల్‌: కొత్త వాహనం కొనాలంటేనే గుండె గుభేల్‌మనేలా జీవిత పన్నుని ప్రభుత్వం ఎడాపెడా పెంచేసింది. పెంచిన లైఫ్‌ట్యాక్స్‌ను 2021 నవంబర్‌ నుంచి అమలులోకి తెచ్చింది. జీవిత పన్ను, హరిత పన్ను పెంపు వల్ల ప్రజలపై ఏటా 409 కోట్ల భారం పడుతోంది. 2021 నవంబర్‌ నుంచి 2024 ఏప్రిల్ వరకు లెక్కిస్తే సుమారు రెండున్నరేళ్ల కాలంలో ప్రజలపై వెయ్యి 22 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది.

బస్సు ఛార్జీలు ఇష్టానుసారం పెంపు: సామాన్యులు ఎక్కువగా ఆధారపడే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల్ని జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం పెంచేసింది. 2019 డిసెంబర్‌, 2022 ఏప్రిల్‌, జులై మాసాల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై విపరీతమైన భారం మోపింది. 2019 డిసెంబర్‌ నుంచి మూడు దఫాలుగా పెంచిన ఛార్జీల వల్ల ప్రజలపై 2024 ఏప్రిల్‌ వరకు సుమారు 5 వేల 2 వందల 43 కోట్ల అదనపు భారం మోపుతోంది.

Electricity Charges Hike: మరోసారి బాదుడేబాదుడు.. విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు పిడుగు

ఉచిత ఇసుకను రద్దు చేసి: వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానం రద్దు చేసింది. టన్ను ధర 375రూపాయలుగా నిర్ణయించింది. 2019 సెప్టెంబర్‌ నుంచి 2021 ఏప్రిల్‌ వరకు 20 నెలల్లో సుమారు 3 కోట్ల 60 లక్షల టన్నుల ఇసుకను APMDC విక్రయించింది. దాని విలువ 13 వందల 50 కోట్లు. 2021 మే నుంచి ఇసుక తవ్వకాలు, విక్రయాల్ని జేపీ పవర్ వెంచర్స్‌ అనే సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. టన్ను ఇసుక ధరను 475 రూపాయలుగా నిర్ణయించింది. ఆ సంస్థ ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయిస్తుందని గనుల శాఖ అంచనా. ఆ లెక్కన 2021 మే నుంచి 2024 మే వరకు సుమారు 6 కోట్ల టన్నుల ఇసుక విక్రయిస్తుంది. దాని విలువ 2 వేల 8వందల 50 కోట్లు. ఉచిత ఇసుక విధానం రద్దు చేయడం వల్ల ప్రజలపై సుమారు 4 వేల 200 కోట్ల రూపాయల భారం పడుతోంది.

ఫైబర్‌నెట్ భారం: ప్రజలకు చౌక ధరలో ఇంటర్నెట్‌, టీవీ ఛానళ్లు, ఫోన్ సదుపాయాన్ని ఒక ప్యాకేజీగా అందజేసేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైబర్‌నెట్‌నూ జగన్‌ ప్రభుత్వం భారంగా మార్చింది. 149 రూపాయలుగా ఉన్న బేసిక్‌ ప్లాన్‌నే 350కి పెంచింది. మొత్తం ఎనిమిదిన్నర లక్షల ఫైబర్‌నెట్‌ కనెక్షన్లపై నెలకు 17 కోట్ల 8 లక్షల చొప్పున అదనపు భారం మోపింది. ఐదేళ్లలో ప్రజలపై సుమారు 85 కోట్ల రూపాయల భారం పడుతోంది.

మీ సేవ బాదుడుతో 120 కోట్ల రూపాయల భారం: మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీసు ఛార్జీల్ని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్‌ 11వ తేదీ నుంచి 5 రూపాయల చొప్పున పెంచింది. దీని వల్ల ప్రజలపై ఏడాదికి సుమారు 60 కోట్ల చొప్పున రెండేళ్లలో సుమారు 120 కోట్ల భారం పడుతోంది.

మార్కెట్ విలువల్ని భారీగా పెంచేసి: వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక 2020లో భూముల మార్కెట్ విలువల్ని సవరించింది. కొత్త జిల్లాలు ఏర్పాటవడానికి ముందే గుంటూరు, బాపట్ల, నరసరావుపేటల్లో మార్కెటు విలువలు పెంచారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత ఆయా జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్‌ విలువల్ని, సమీపంలోని పరిశ్రమలు, జాతీయ రహదారులు, దుకాణాలు, ఇతర అంశాల ఆధారంగా సవరించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో అక్కడి డిమాండ్‌ని బట్టి మార్కెట్ విలువల్ని 13 నుంచి 75 శాతం వరకు పెంచారు.

Burden on Andhra Pradesh People with High Taxes: 2022 జూన్‌ 1 నుంచి అన్ని రకాల నిర్మాణాల మార్కెట్‌ విలువల్ని ప్రభుత్వం పెంచింది. డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌కి మార్కెట్ విలువలో ఒక శాతాన్ని స్టాంప్‌ డ్యూటీగా చెల్లించే విధానాన్ని సవరించింది. డెవలప్‌మెంట్‌కి ఇచ్చిన స్థలం యజమానులు ఒకరి కంటే ఎక్కువ మంది ఉండి, తమ వాటాకి వచ్చే ఫ్లాట్లను వేర్వేరుగా పంచుకుంటామని ఒప్పందంలో పేర్కొంటే వారంతా ఒప్పంద విలువపై చెరో 4 శాతం చొప్పున కన్వేయన్స్‌ స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలని నిబంధన పెట్టారు. చివరకు ఆ భారం ఫ్లాట్లు కొనుక్కునేవారిపైనే పడనుంది.

సేల్‌ కం GPA రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన స్టాంప్ డ్యూటీ వసూళ్లలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం భూమి యజమాని నుంచి పవర్ ఆఫ్ అటార్నీ పొందేందుకు 5 శాతం స్టాంప్‌ డ్యూటీ చెల్లిస్తున్నారు. ఆ భూమిని పవర్ ఆఫ్‌ అటార్నీ పొందిన వ్యక్తే కొనుగోలు చేస్తున్నా, లేకపోతే వేరేవారికి విక్రయించినా, ఇది వరకు చెల్లించిన 5 శాతం స్టాంప్ డ్యూటీలో 4 శాతం మినహాయింపునిచ్చి, రిజిస్ట్రేషన్ ఫీజులోమిగతా మొత్తాన్ని కట్టించుకునేవారు. ఇప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తి ఆ భూమిని కొంటేనే 4 శాతం మినహాయింపునిస్తున్నారు. వేరేవారికి విక్రయిస్తే ఎలాంటి మినహాయింపులూ లేవు. మార్కెట్ విలువల పెంపు వల్ల ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలపై సుమారు వెయ్యి కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది.

Land Registration Charges భూ రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడుపై ఆగ్రహం.. శాస్త్రీయత లేకుండా పెంచారని ఆరోపణ

అడ్డగోలుగా యూజర్‌ ఛార్జీలు పెంపు: రిజిస్ట్రేషన్ శాఖ 10 రకాల సేవలకు సంబంధించిన యూజర్‌ ఛార్జీల్ని అడ్డగోలుగా పెంచింది. ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ చేసేందుకు రుసుమును 10 రూపాయల నుంచి 100కి పెంచారు. 10 షీట్ల వరకు ఉండే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు కేటగిరీని బట్టి ఇది వరకు 100, 200 వసూలు చేసేవారు. దాన్ని ఇప్పుడు 500 రూపాయలకు పెంచారు. ఇలా వివిధ రకాల యూజర్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌పైనా సగటున 500 రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. 2023లో సగటున నెలకు 2 లక్షల 17 వేల 441 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే సంవత్సరానికి 130 కోట్లు భారం పడింది.

రైతులపై 500 కోట్ల రూపాయల భారం వేస్తూ: ఇప్పటికే తీవ్ర కష్టనష్టాల్లో ఉన్న రైతులపై నీటి తీరువా బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తోంది. 2013-14 నుంచి రైతులు చెల్లించాల్సిన నీటి తీరువా బకాయిలు 650 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుని ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నవారి పేరు మీద వాటిని క్రమబద్ధీకరించే పేరుతో ప్రభుత్వం వారిపై 500 కోట్ల భారం మోపింది. U.L.C. చట్టం కింద మిగులు భూముల్ని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి నుంచి క్రమబద్ధీకరణ రుసుము పేరుతో సుమారు 500 కోట్ల భారం మోపుతోంది. ఇక నాలా చట్టం కింద భూ వినియోగ మార్పిడిపై మరో 500 కోట్ల రూపాయల భారం వేస్తోంది.

ఆ భారమంతా విద్యార్థుల తల్లిదండ్రులపైనే: ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక 2020-21 నుంచి బోధన రుసుములు చెల్లించడం నిలిపివేసింది. ఆ భారమంతా విద్యార్థుల తల్లిదండ్రులపై పడుతోంది. ఇలా వైఎస్సార్​సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో సుమారు 14 వందల కోట్ల భారం మోపింది. ఇలా ఛార్జీల పెంపు, పన్నుల బాదుడు వల్ల వైఎస్సార్​సీపీ హయాంలో ప్రజలపై మొత్తంగా లక్షా 7 వేల 836 కోట్ల రూపాయల భారం పడింది.

ఏపీలో విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు - ప్రజలపై 1,723 కోట్ల భారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details