తీరం.. ఓటెత్తిన చైతన్యం - ap panchayath elections latest news
గుంటూరు జిల్లాలోని తెనాలి డివిజన్‌లో మొదటి దశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కువ మంది ఓటు వేసేందుకు వరుస కట్టారు. జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పక్కాగా చేయడంతో పోలింగ్ ప్రక్రియ సాఫీగా కొనసాగింది. మొదటి రెండు గంటలు మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. 10.30 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వరుస కట్టడంతో పోలింగ్ శాతం పెరిగింది.
ap panchayathi elcctions first phase elections polling percentage
By
Published : Feb 10, 2021, 3:21 PM IST
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పల్లె వాసులు పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పరిధిలోని గ్రామాల్లో ఉదయం ఆరు గంటలకే సందడి నెలకొంది. పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను సైతం రప్పించడంతో మొత్తం మీద 83.04 శాతం పోలింగ్ నమోదైంది. డివిజన్ పరిధిలోని 270 పంచాయతీల్లో మొత్తం 6,62,046 మంది ఓటర్లు ఉండగా, 5,50,618 మంది ఓటు వేశారు.
గత పంచాయతీ ఎన్నికల్లో తెనాలి డివిజన్‌లో 291 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 84.56 శాతం ఓటింగ్ నమోదైంది. అప్పట్లో 6,67,639 ఓటర్లు ఉండగా 5,63,331 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాడు 84.56 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి కొంత తగ్గడం గమనార్హం. తొలిసారి ఓటుహక్కు పొందిన యువత నుంచి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుల వరకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు.
అనారోగ్యంతో నడవలేనివారు ఆటోలు, వాహనాల్లో కేంద్రం వరకు వచ్చి సహాయకుల సాయంతో ఓటు వేశారు. తీర గ్రామాల్లో ఉదయం 6.30 గంటల నుంచి ఓటర్లు బారులుదీరారు. మధ్యాహ్నం 12 గంటలకే చిన్న పంచాయతీల్లో పోలింగ్ పూర్తయింది. మేజరు, పెద్ద పంచాయతీల్లో మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఓటర్లు వరుసలో నిలబడి ఓటు వేశారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత సింహభాగం పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు లేరు.
ప్రత్యేక జాగ్రత్తలతో అనుమతి
కరోనా నేపథ్యంలో ఓటర్లను కేంద్రాల్లోకి ప్రవేశం వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచి అందరూ చేతులకు శానిటైజ్ చేసుకున్న తర్వాతే అనుమతించారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని చేతులకు గ్లౌజులు వేసుకుని ప్రతిఒక్కరిని శానిటైజ్ చేసుకున్న తర్వాతే పంపారు. కొన్ని కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతించారు. మాస్క్‌లు ధరించిన వారే ఓటింగ్‌కు అనుమతించారు.
కొత్తపాలెం 94.27%
కొత్తపాలెం(పిట్టలవానిపాలెం): పిట్టలవానిపాలెం మండలంలోని కొత్తపాలెంలో ఎక్కువ మంది వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. కాని ఎన్నికల సమయంలో వారంతా గ్రామానికి వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు. గ్రామంలో పురుషులు 493, మహిళలు 511 ఓటర్లుగా ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికల్ల్లో 92 శాతం ఓట్లు పోలవ్వగా ఇప్పుడు అత్యధికంగా 94.27 శాతం ఓట్లు పోలయ్యాయి.
అర్ధరాత్రి దాటినా.. కొనసాగిన లెక్కింపు
తెనాలి డివిజన్‌లో గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ 12 గంటలకే సింహభాగం ఓట్లు పోలయ్యాయి. మేజరు పంచాయతీల్లోనే 1.30 గంటల వరకు ఓటర్లు ఓట్లు వేయడానికి వచ్చారు. ఈసారి పోలింగ్ సమయం 3.30 గంటల వరకు పెంచడంతో లెక్కింపు ఆలస్యంగా ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటినా ఫలితాల కోసం నిరీక్షణ తప్పలేదు. పోలింగ్ పూర్తయ్యాక పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్ల సరళిని తెలుసుకోవడం, జాబితా ఆధారంగా ఓట్ల లెక్కలు తేల్చుకుని ఫలితాల కోసం ఎదురుచూశారు. అర్ధరాత్రి 12 గంటలైనా సగం పంచాయతీల్లో లెక్కింపు పూర్తికాలేదు. కొన్నిచోట్ల వివాదాలతో ఓట్ల లెక్కింపులో జాప్యం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రంతా ఓట్ల లెక్కింపు కొనసాగింది.