నవ్యాంధ్ర రాజధాని అమరావతికి పునాదులు పడ్డ గుంటూరు జిల్లాకు మంత్రి మండలిలో రెండు స్థానాలు దక్కాయి. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకతోటి సుచరిత, రేపల్లెలో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణరావుకు సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రివర్గంలో చోటు దక్కింది. వీరితో సచివాలయ ప్రాంగణంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.
మంత్రిగా మేకతోటి సుచరిత ప్రమాణం ఆవిర్భావం నుంచి వెన్నంటే.....వైకాపా ఆవిర్భావం నుంచి వెన్నంటి నిలిచిన మేకతోటి సుచరితకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు జగన్. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి, ఆయన మరణాంతరం జగన్ వెంట నడిచి 2012లో శాసనసభ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. అప్పట్లో జరిగిన ఉపఎన్నికల్లో వైకాపా తరపున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచే బరిలోకి దిగి తెదేపా అభ్యర్థి రావెల కిషోర్‌బాబు చేతిలో పరాజయం పొందారు. అయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడంతోపాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి తిరిగి విజయం సాధించారు. మంత్రిగా మోపిదేవి వెంకటరమణ ప్రమాణం సీనియారిటీకి ప్రాధాన్యంజిల్లాలో వైకాపా సీనియర్ నేతగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావుకు మంత్రివర్గంలో స్థానం లభించింది. తొలి నుంచి కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన వైకాపా తరపున 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉండడం, ఆపై మత్స్యకార కుటుంబానికి చెందడంతో మంత్రివర్గంలో చోటు దక్కింది.గతంలో మూడు మంత్రిత్వశాఖలు నిర్వహించిన అనుభవం కూడా కలిసొచ్చింది. డెల్టా ప్రాంతంలో కీలకమైన నేతగా ఉండడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందారు.తీరప్రాంతానికి ప్రాధాన్యంబాపట్ల నుంచి వరుసగా రెండోసారి వైకాపా తరపున గెలుపొందిన కోన రఘుపతికి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ప్రచారం జరిగినప్పటికీ సామాజిక సమీకరణాల్లో దృష్ట్యా ఆయనకు ఉప సభాపతి పదవికి ఎంపిక చేశారు.