ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP Land Title Act: వైసీపీ ప్రభుత్వ ప్రచారాలకే పరిమితమైన చట్టాలు.. ఖాతాలో మరో యాక్ట్​ - భూముల రీ సర్వే

Andhra Pradesh Land Titling Bill: కేంద్రం నుంచి విభజన చట్టం హామీలను సాధించడంలో విఫలమైన జగన్‌ శాసనసభలో స్వయంగా రూపొందించి.. పంపించిన బిల్లులకు కూడా ఆమోదం తెచ్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే దిశాచట్టం దిక్కులేని పరిస్థితుల్లో ఉండగా ల్యాండ్ టైటిల్‌ యాక్ట్‌ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అనేకసార్లు దిల్లీలో ప్రదక్షిణలు చేసిన సీఎం జగన్‌ ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌కు కేంద్రం నుంచి ఆమోదం పొందడంలో ఘోరంగా విఫలమయ్యారు.

YSRCP_Government_Land_Title_Act
YSRCP_Government_Land_Title_Act

By

Published : Aug 11, 2023, 8:51 AM IST

YSRCP_Government_Land_Title_Act: వైసీపీ ప్రభుత్వ ప్రచారాలకే పరిమితమైన చట్టాలు.. ఖాతాలో మరో యాక్ట్​

AP Land Title Act not get Central Permissions: జగన్‌ చెప్పిన విజన్ మాటలకే పరిమితమైంది. దిశ చట్టంలాగే ముందెన్నడూ లేని విధంగా తెస్తున్నామని జగన్‌ గొప్పగా చెప్పిన ల్యాండ్‌ టైటిల్ యాక్ట్‌ కూడా వైసీపీ ప్రచారానికి తప్ప ప్రజలకు పనికిరాలేదు. 2019 జులై 29నే ల్యాండ్‌ టైటిల్‌ యాక్టును శాసనసభ ఆమోదించింది. కానీ ఇంతవరకూ కేంద్రం ఆ చట్టానికి అంగీకారం తెలపలేదు. ఆ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత జగన్ అనేక సార్లు దిల్లీ వెళ్లారు. కేంద్ర పెద్దలను కలవడమేతప్ప.. ఈ యాక్టు విషయంలో ఏమీ సాధించలేకపోయారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ ఎప్పటికి చట్టరూపుదాలుస్తుందో తెలియక.. భూముల రీ సర్వే పూర్తైన చోట పాత పద్ధతిలోనే రైతులకు అధికారులు కొత్త పట్టా పాసు పుస్తకాలిస్తున్నారు.

కేంద్ర రిజిస్ట్రేషన్‌ చట్టం, కేంద్ర స్టాంప్‌ చట్టం-1899, కేంద్ర భూ సేకరణ, పరిహార చట్టం-2013 వంటి వాటికి చెందిన వివిధాంశాలు టైటిల్‌ యాక్టు బిల్లులో ఉన్నాయి. దాన్ని ఆమోదించే విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. కేంద్రంలోని అధికారుల సందేహాలకు వైసీపీ సర్కార్‌ సమాధానం ఇవ్వకపోవడం వల్లే ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ కాగితాలకే పరిమితం అయిందనే విమర్శలున్నాయి. కేంద్ర చట్టాలను ప్రభావితం చేయని విధంగానే ల్యాండ్‌ టైటిల్‌ యాక్టు బిల్లు రూపొందించామని వైసీపీ ప్రభుత్వం చెప్పుకొస్తున్నా.. బిల్లుకు మోక్షం దక్కలేదు. రాష్ట్రం నుంచి వెళ్లిన బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా.. రాష్ట్రపతి ఆమోదం నేటికీ రాలేదు.

విభజన చట్టం ద్వారా ఏపీకి రావాల్సినవి తేవడంలో వైసీపీ విఫలం: టీడీపీ ఎంపీలు

AP Land Title Act: ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తే భూమిపై హక్కుకు పూర్తి హామీ ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. భూమి ఉన్నా సరైన పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర హక్కుల పత్రాలు లేకనో, దస్త్రాల్లో వివరాలు సరిగ్గా నమోదు కాకనో.. భూ యజమానులు లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం భూమిపై హక్కుకు భద్రత ఉండాలన్నా.. పంట రుణం, బీమా, పెట్టుబడి సాయం, ఇతర ఏ లబ్ధి పొందాలన్నా భూమి స్వాధీనంలో ఉంటే సరిపోదు. దస్తావేజులు, పట్టా కాగితాలు, రెవెన్యూ శాఖ లేదా ఇతర శాఖల వద్ద ఉన్న భూ రికార్డులేవీ హక్కులకు అంతిమ సాక్ష్యంగా ఉండడం లేదు.

ఇవన్నీ రెవెన్యూ, ఇతర శాఖలు నిర్వహించే దస్త్రాల్లో నమోదై ఉండాలి. ఒకవేళ నమోదు కాకపోయినా ఆ వివరాల్లో తప్పులున్నా.. రైతులకు తిప్పలు తప్పడం లేదు. దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ వల్ల భూమిపై హక్కులకు గ్యారంటీ లేదు. ఎందుకంటే చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్‌ కాగితాలకేగాని, హక్కులకు జరగదు. రిజిస్ట్రేషన్‌ దస్తావేజు భూమి హక్కుల బదలాయింపునకు హామీ ఇవ్వదు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తే భూ లావాదేవీలు ఎలక్టాన్రిక్‌ పద్ధతిలో సులువుగా జరిగే అవకాశం ఉంది. ఈ చట్టం అమలుకు ప్రత్యేక భూ అథారిటీ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన.

విభజన చట్టంలోని అంశాలన్నీ నెరవేర్చారా..? లేదా..?: ఎంపీ రామ్మోహన్ నాయుడు

Land Resurvey in AP: టైటిల్‌ రిజిస్ట్రేషన్స్‌ కోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తారు. వివాదాల పరిష్కారానికి జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ల్యాండ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పడుతుంది. వీటిపైన జిల్లా జడ్జి ఆధ్వర్యంలో అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటవుతుంది. అక్కడా పరిష్కారం కాకపోతే.. హైకోర్టులో ప్రత్యేక బెంచ్‌ను ఆశ్రయించొచ్చు. దీనిద్వారా టైటిల్‌ నిర్థారణ జరుగుతుంది. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ఫైనల్‌ లిస్టును బహిరంగంగా ప్రకటించిన అనంతరం రెండేళ్లలోగా అభ్యంతరాలు రాకుంటే గ్యారెంటీ టైటిల్‌ కింద ప్రకటిస్తారు.

ల్యాండ్‌ టైటిల్‌ యాక్టులో కీలకమైన భూముల రీ-సర్వేపై ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యమిది. 2023 జనవరి నాటికి రీ-సర్వే పూర్తి చేస్తామని.. జగన్‌ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత గడువు 2023 జూన్‌కు మారిపోయింది. ఐనా భూముల రీసర్వే పూర్తి కాలేదు. ఇప్పటిదాకా కేవలం 2 వేల గ్రామాల్లోనే.. రీ-సర్వే పూర్తిస్థాయిలో ముగిసింది. మలివిడతగా మరో రెండువేల గ్రామాల్లో ప్రక్రియ జరుగుతుండగా.. అక్టోబరు 15నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మలివిడత గ్రామాల్లో 25లక్షల 32 వేల 146 సర్వే రాళ్లు పాతాల్సి ఉంటే.. ఇప్పటికి కేవలం 3లక్షల 32 వేల 37 రాళ్లు మాత్రమే పాతారు. ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో, ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ ఎప్పుడు అమల్లోకి వస్తుందో.. తెలియడం లేదు.

parliament: చాలా చేశాం.. ఇంకా చేస్తున్నాం..!

ABOUT THE AUTHOR

...view details