AP Contract Professors Protest: జాబు ఉండాలంటే బాబు పోవాలి.. తాను అధికారంలోకి వస్తే కాంట్రాక్టు అధ్యాపకులందరినీ పర్మినెంట్ చేస్తానంటూ.. నెల్లూరు జిల్లా ములుముడిలో 2018 ఫిబ్రవరి 4న జగన్ హామీ ఇచ్చారు. అప్పటి హామీనే కాదు.. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, సర్య్కులర్లనూ అమలు చేయడం లేదు. జీవో 110 ప్రకారం ఒప్పంద అధ్యాపకులు హోదాను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మార్చాలని, కనీస వేతనం అమలు చేయాలని 2023 మార్చి 6న ఉన్నత విద్యామండలి అత్యవసర సర్కులర్ జారీ చేసింది. దీన్ని కూడా అమలు చేయలేదు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు కనీస వేతనం అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒక్కో వర్సిటీలో ఒక్కో విధంగా కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు ఇస్తోంది. డిగ్రీ కళాశాలల్లో జీవో 24 ప్రకారం కనీస టైం స్కేల్ అమలు చేస్తున్నా.. వర్సిటీల్లో మాత్రం అమలు కావడం లేదు.
Contract Professors Protest కాంట్రాక్టు అధ్యాపకులను నిలువునా ముంచేసిన వైసీపీ సర్కార్..
AP Contract Professors Protest: వారంతా విద్యావంతులు.. పరిశోధనలు చేసి పట్టాలు పొందినవారు. అలాంటి ఉన్నత విద్యావంతులకే సీఎం జగన్ టోకరా వేశారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఆచార్యులను నమ్మించి నిలువునా వంచించారు. గత ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకపోగా.. అప్పటి జీవోకు మార్పులు చేసి వేతనం తక్కువ వచ్చేలా కొత్త జీవో ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకపోవడంతో.. ప్రభుత్వ తీరుపై ఒప్పంద అధ్యాపకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ ప్రకారం తమను పర్మినెంట్ చేస్తారని ఆచార్యులు ఊహించారు. కానీ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోనే మేలనే విషయం తెలియడానికి.. వారికి నాలుగేళ్లు పట్టింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 24 ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులకు నెలకు రూ.57 వేలు వేతనం రావాలి. డీఏ, హెచ్ఆర్ఏ కూడా ఇస్తే రూ.80వేల వరకు వేతనం అందే అవకాశం ఉండేది. కానీ డీఏ అనేది వర్సిటీ ఐచ్ఛికం. కనీసం టైం స్కేల్ రూ.57వేలు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 17 వర్సిటీలు ఉన్నాయి. వీటిలో 2వేల మంది కాంట్రాక్టు అధ్యాపకులే. కొన్ని వర్సిటీలు ఒప్పంద అధ్యాపకులకు రూ.40వేలు ఇస్తే.. కొన్ని రూ.22వేలు మాత్రమే ఇస్తున్నాయి. శాశ్వత అధ్యాపకుల తరహాలో యూజీసీ నెట్, ఏపీ సెట్, పీహెచ్ అర్హతలు ఉంటేనే కాంట్రాక్టు అధ్యాపకులుగా తీసుకుంటున్నారు. వీరిని టీచింగ్ అసిస్టెంట్, అకడమిక్ కన్సల్టెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాల్లో తీసుకుంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 110 ప్రకారం మినిమం టైంస్కేల్ రూ.35వేలు మాత్రమే. నెట్, పీహెచ్‌డీ రెండూ ఉంటే రూ.40వేలు ఇస్తారు. అనుభవాన్ని బట్టి ఏడాదికి వెయ్యి చొప్పున పెంచుతారు. ఈ జీవోను దాదాపు 10 యూనివర్శిటీలు అమలు చేయడం లేదు. ఎస్కేయూ, జేఎన్టీయూ అనంతపురం, రాయలసీమ వర్సిటీ , ఏఎన్యూ, అంబేడ్కర్, నన్నయ వర్సీటీలు మాత్రమే అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం రూ.35వేలు మినిమం టైంస్కేల్ ఇస్తున్నారు. పద్మావతి యూనివర్సిటీలో జీవో ప్రకారం రూ.35 వేలు వేతనం నిర్ణయించినా.. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని పెంచడం లేదు. ఈ వర్శిటీల అధ్యాపకులు కూడా న్యాయస్థానాల్లో పిటిషన్ వేసి ఉంటే.. వాటిని ఉపసంహరించుకున్న వారికే అమలు చేస్తామని చెప్పారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా.. కొత్త జీవో తెచ్చి తమ వేతనాలను తగ్గించారని కాంట్రాక్టు అధ్యాపకులు మండిపడుతున్నారు. అంతా ఒక వేదికపైకి వచ్చి పోరాటం చేయాలని భావిస్తున్నారు.