వీసీ విడుదల.. అరెస్టు అన్యాయమని ఆవేదన - దామోదర్ నాయుడు
వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి దామోదర్ నాయుడు.. జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. తనపై అట్రాసిటీ కేసు వేయడం అన్యాయమని ఆవేదన చెందారు.
అట్రాసిటీ ఆరోపణలతో అరెస్టయిన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి దామోదర్ నాయుడు.. గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. తాను ఎవరినీ కులం పేరుతో దూషించలేదని దామోదర్ చెప్పారు. అనవసరంగా అట్రాసిటీ కేసు బనాయించి చట్టాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తనపై కేసు పెట్టడం వెనక కొన్ని శక్తులు ఉన్నాయని అనుమానించారు. గవర్నర్ అనుమతి లేకుండా వీసీని ఎలా అరెస్ట్ చేస్తారని దామోదర్ తరఫు న్యాయవాది హరిబాబు ప్రశ్నించారు. ఈ వ్యవహారం వెనక ప్రభుత్వం కుట్ర ఉందని ఆరోపించారు.