ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Roads Condition in AP: "సీఎం గారూ.. కాస్తా హెలికాఫ్టర్​ నుంచి కిందకు దిగితే రోడ్లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది"

Damaged Roads in AP: జగన్‌ వస్తుంటే రోడ్లు కనిపించకుండా పరదాలు ఎందుకు కడతారు.? పదిహేను కిలోమీటర్ల దూరానికీ హెలికాప్టర్‌లో ఎందుకు తిరుగుతారు...? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ నోటితో చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రంలో ఉన్న కొన్నిరోడ్ల వంక చూసినా.. ఇట్టే తెలిసిపోతుంది. గజానికో గుంత.. అడుగుకో మడుగులా మారిన రోడ్లు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. ప్రయాణం అంటేనే.. వాహనదారులు బెంబెలెత్తుతున్నారు. సీఎం గారు ఒక్కాసారి నింగి నుంచి నేలకు దిగితే.. తమ కష్టాలు తెలుస్తాయని ప్రజలు ఆక్రోశిస్తున్నారు.

Roads Condition in AP
Roads Condition in AP

By

Published : Jul 11, 2023, 10:02 AM IST

"సీఎం గారూ.. కాస్తా హెలికాఫ్టర్​ నుంచి కిందకు దిగితే రోడ్లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది"

Damaged Roads in AP: రాష్ట్రంలో రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అడుగుకో గుంత.. గజానికో మడుగు అన్నట్లు తయారైన రోడ్లు.. ప్రయాణికులకు నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. అలాంటి రహదారుల్లో ఉదాహరణకు కొన్ని ఇప్పుడు చూద్దాం.. కాదు కాదు చదువుదాం..

అది కృష్ణా జిల్లా పామర్రు నుంచి.. అవనిగడ్డ వెళ్లే ప్రధాన రహదారి. కానీ నాలుగు సంవత్సరాలుగా కనీస మరమ్మతులు కూడా లేక ఇలా గోతులు తేలింది. వర్షం కూడా పడడంతో.. ఇక్కడో రోడ్డు ఉందని ఎవరో చెప్తే తప్ప గుర్తించలేనంత హీనంగా మారింది. ఆ రహదారిలో వచ్తిన ఓ లారీ బురదలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించిన అది బయటకు రాలేదు. వ్యయ ప్రయాసలకు ఓడ్చి చివరకు ప్రొక్లైన్‌ సాయంతో లారీ ఆ గొయ్యి దాటింది. హమ్మయ్య అనుకునేలోపే మరో గొయ్యి. అలా గజానికో గుంత. అడుగుకో మడుగు.. బుద్ది తక్కువై ఈ రోడ్డుకు వచ్చానురా బాబోయ్ అని లారీ డ్రైవర్‌ మొత్తుకోవాల్సి వచ్చింది. రోజూ.. ఈ రోడ్డులో తిరగాలంటే దినదిన గండమే అని స్థానికులు మొత్తుకుంటున్నారు.

ఇక అదే రోడ్డులో ఇంకొంచెం ముందుకెళ్తే.. పెదపూడి వద్ద కూడా అదే సీన్‌.! కాకపోతే.. ఈసారి ట్రాక్టర్‌ వంతు.! ముందు లారీ కాబట్టి ఈ గోతులకు తట్టుకుంది. కానీ ట్రాక్టర్‌ ట్రక్కు మాత్రం తట్టుకోలేక తిరగబడింది. బతుకు జీవుడా అంటూ.. ట్రాక్టర్‌ దిగిన డ్రైవర్‌.. తాళ్ల సాయంతో వాహనాన్ని చక్కదిద్దుకున్నారు. ఇలా ఈ మార్గంలో ప్రయాణం అంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి.

ఇక మరో దగ్గర రోడ్డు మధ్యలో చెట్లు మొలిచినట్లు కనిపిస్తాయి. ఈ మార్గంలో ఇలాంటివి చాలానే కనిపిస్తాయి. ఇవి మొలిచినవి కాదు..! అక్కడ ఓ గొయ్యి ఉందని కొత్త వ్యక్తులకు తెలిసేలా.. స్థానికులే.. చెట్ల కొమ్మలు విరిచి అక్కడ పెట్టారు. ఈ మార్గంలో కారు వేసుకుని ఎవరైనా వచ్చారంటే..షెడ్డుకు వెళ్లాల్సిందే. చాలా కార్లకు కింద భాగం.. రోడ్డుకు గీసుకొంటోంది. ఆయిల్‌ ట్యాంకులు దెబ్బతింటున్నాయి. బళ్లు, ఒళ్లూ.. గుళ్లవుతున్నాయి. రోజూ వచ్చే ఆటోలు, పాఠశాల బస్సులు, ఆర‌్టీసీ బస్సులు.. ఈ నకరంలో ఇంకెన్నాళ్లు తిరగాలో అని బోరుమంటున్నాయి.

మరోటి కృష్ణాజిల్లా మొవ్వమండలం కూచిపూడి -పెడతనగల్లు రోడ్డు..! జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య స్వగ్రామానికీ ఇటుగానే వెళ్లాలి. కనీసం.. ఆ దార్శనికుడి గ్రామానికీ మంచి దారి వేయలేకపోయారు. పైనుంచి చూస్తే ఇది.. రహదారా, చేపల చెరువా అన్నట్లుంది. ఈ రోడ్డులో ద్విచక్ర వాహనాలైతే మెలికలు తిరగాల్సిందే. అదే సమయంలో ఎదురుగా మరో వాహనం వచ్చిందా సర్కస్‌ ఫీట్లు చేయాల్సిందే..! రోజువారీ పనులకు వెళ్లేవాళ్లు కింద పడకుండా ఇల్లు చేరితే గండం గట్టెక్కినట్లే. నాలుగేళ్లుగా రహదారులు బాగుచేస్తారని ఎదురుచూడడమే తప్ప.. గోతుల బాధ నుంచి విముక్తి లభించడం లేదని.. వాహనదారులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details