CM Jagan Reddy Meets Nirmala Sitharaman: రాష్ట్ర రుణాలపై ఆంక్షలు విధించొద్దని ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. పోలవరం, ప్రత్యేక హోదా సహా 9 అంశాలపై నిర్మాలా సీతారామన్‌తో చర్చించినట్లు..ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
రెండ్రోజుల దిల్లీ పర్యటనలో భాగంగా... గతరాత్రి కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలిసిన సీఎం జగన్ గురువారం ఉదయం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు. సమావేశంలో మొత్తం 9 అంశాలపై చర్చించినట్లు.. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకపోయినా రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని వివరించినట్లు తెలిపింది. 2021-22 సంవత్సరంలో 42 వేల 472 కోట్ల రుణపరిమితిని కల్పించి, తదుపరి కాలంలో 17 వేల 923 కోట్లుకు కుదించారంటూ ఆర్థిక మంత్రి వద్ద సీఎం ప్రస్తావించారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారని వివరించారు.
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద 36 వేల 625 కోట్లు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేసేలా చూడాలని కోరినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని, డయాఫ్రంవాల్ మరమ్మతులకు అవసరమైన రూ.2వేల 20 కోట్లు వెంటనే విడుదలచేయాలని విజ్ఞప్తి చేసినట్లు ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన 2 వేల 600 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్ చేయాలని కోరినట్లు తెలిపింది.
పోలవరం టెక్నికల్అడ్వయిజరీ 55 వేల 548 కోట్ల రూపాయలతో నిర్థరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారని. వివరించింది. ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి రూ.2,500 కోట్లు బకాయిలు రావాలని, వాటని వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు.. ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ డిస్కంల నుంచి.. ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ. 7వేల58 కోట్లు రావాల్సి ఉందని ఈ డబ్బునూ వెంటనే ఇప్పించాల్సిందిగా కోరినట్లు తెలిపింది. ఇక దిల్లీ వెళ్లిన ప్రతీసారి అడుగుతూనే ఉంటానని మొదట్నుంచీ చెప్తున్న జగన్ ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ ఇవీ చదవండి: