Anarchies Increased on SC,ST People in YSRCP Government in AP జగన్ పాలనలో రాష్ట్రంలో ఎస్సీ-ఎస్టీలు దారుణమైన అణచివేతకు, హింసకు గురవుతున్నారు. నెలకు ముగ్గురు ఎస్సీ-ఎస్టీలు హత్యగావించబడుతున్నారు. వారానికి నలుగురు దళిత, గిరిజన మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. సగటున రోజులు 7 దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అధికార వైఎస్సార్సీపీ నాయకులే దళితులు, గిరిజనులపై ఈ దమనకాండకు పాల్పడుతున్నారు. 2021లో నమోదైన కేసులపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికే ఈ గణాంకాలను తేటతెల్లం చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల పేదలు, పెత్తందార్లు అంటూ కొత్త పలుకులు అందుకున్నారు. అంబేడ్కర్, జ్యోతిబూ ఫులే, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు తరహాలో జీవితాన్ని పణంగా పెట్టి పేదలకు సేవ చేశానన్నట్లు బీరాలు పలుకుతున్నారు. పార్టీ నేతలకు నాలుగు రాజకీయ పదవులిచ్చి అదే పేదలందరికీ చేసిన గొప్ప సామాజిక న్యాయమనేలా మాట్లాడుతున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా దళితులు, గిరిజనులపై అరాచకాలు పెరిగిపోయాయి. దళితుణ్ని చంపి డోర్ డెలివరీ చేయడం, మాస్కు అడిగిన కారణంగా వైద్యుడ్ని మానసికంగా క్షోభపెట్టి ప్రాణాలు వదిలేలా చేయడం, అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు దళిత యువకుడికి.. పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేయడం, మాస్కు పెట్టుకోలేదని మరో దళిత యువకుణ్ని లాఠీలతో చితకబాది చావుకు కారణం కావడం వంటి అసాధారణ దౌర్జన్యాలు ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్నా దాడులకు ఉదాహరణలు మాత్రమే. ముఖ్యమంత్రి మాత్రం వాటి ఊసే ఎత్తకుండా.. దళిత దీనజనోద్ధారకునిలా పదే పదే ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అనే మంత్రాన్ని జపిస్తున్నారు. నాలుగు సంవత్సరాల వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి ప్రత్యేకంగా చేసిందేమీ లేకున్నా గొప్పలు మాత్రం చెబుతున్నారు.
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు సమాజాన్ని నిర్ఘాంతపరుస్తున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ చేయని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు మేలు చేస్తోందంటూ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నా.. ఆయా వర్గాల భద్రత గాలిలో దీపంలా మారిందనేది నగ్న సత్యం. రాష్ట్రంలో సగటున రోజుకు ఎస్సీ, ఎస్టీలపై 7 దాడులు, అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతున్నాయి. వారానికి సగటున నలుగురు ఎస్సీ, ఎస్టీ మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. నెలకు సగటున ముగ్గురు దళితులు, గిరిజనులు హత్యకు గురవుతున్నారు. 2021లో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన అమానుషాలపై సాక్షాత్తూ సాంఘిక సంక్షేమశాఖ 1339467/సీవీ.పీవోఏ/2021 నంబర్‌తో 2022 జులై 5న కేంద్రానికి లేఖ రాసింది. 2019, 2020, 2021ల్లో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, అరాచకాలపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్ని అందులో నివేదించింది. ఇవి కాకుండా పోలీసుల దృష్టికి రానివి, వచ్చినా కేసులు నమోదు కానివి మరెన్నో!.
2019లో ఎస్సీ, ఎస్టీలపై వివిధ ఘటనలకు సంబంధించి 2 వేల 727 కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఏడాది 2018తో పోలిస్తే 2019లో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అఘాయిత్యాలు 9 శాతం పెరిగాయి. ఇది వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నదే. తర్వాత కరోనా కారణంగా లాక్‌డౌన్లతో ప్రజలు బయటికి రాకపోవడంతో 2019తో పోల్చితే 2020లో కేసులు 8.7 శాతం తగ్గాయి. ఆ ఏడాది 2 వేల 375 కేసులు నమోదయ్యాయి. 2021 నాటికి ఇలాంటి ఘటనలు అమాంతం 14 శాతం పెరిగి 2 వేల 717కి చేరాయి. ఎస్సీ-ఎస్టీలపై దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. బాధితులు, సాక్షులకు రక్షణ కల్పించాల్సిందిపోయి.. నిందితులను కాపాడేలా పాలకులు, పోలీసులు వ్యవహరించడం... నేరాలకు మరింత ఊతమిచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.