రాజధాని ప్రాంత వైకాపా మంత్రుల వ్యాఖ్యలను నిరసిస్తూ మందడంలో మహిళలు టీషర్టులు ధరించి నిరసన దీక్షలో పాల్గొన్నారు. కృష్ణాయపాలెంలో రైతులు తమ పట్టాదారు పుస్తకాలు, ఆధార్ కార్డులతో దీక్షలు చేపట్టారు. తామంతా రైతులమని నినాదలు చేశారు. న్యాయస్థానాలలో అమరావతికి మద్దతుగా తీర్పురావాలంటూ ఉద్ధండరాయుని పాలెంలో న్యాయదేవతకు పాలాభిషేకం చేశారు.
తుళ్లూరులో మహిళలు మోకాళ్లపై నిల్చొని న్యాయం చేయాలంటూ న్యాయదేవతను వేడుకున్నారు. వైకాపా మంత్రులు అమరావతి రైతులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ షర్టులను ప్రభుత్వేమైనా నిషేధించిందా...అని రైతులు ప్రశ్నించారు. మంత్రులు ఒకసారి ఓడిపోతే ఇక ఇంటికేనని... రైతు మాత్రం ఎప్పటికీ తలెత్తుకొని తిరుగుతారని రైతులు చెప్పారు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్ తన మంత్రులను కట్టడి చేయకపోతే తామే తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.