అమరావతిని రాజధానిగా కొనసాగించాలని.. గవర్నర్ కి పంపిన సీఆర్డీఏ, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను తిరస్కరించాలని కోరుతూ అఖిలపక్ష పార్టీలు, అమరావతి ఐకాస ఆధ్వర్యంలో విజ్ఞాపన దీక్షలు నిర్వహించారు. గుంటూరు సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది కాని.. పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. వైకాపా ప్రభుత్వం చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తుందని విమర్శించారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని ఆరోపించారు.
పోరాటం ఆగదు
సెలెక్ట్ కమిటీలో ఉన్న రెండు బిల్లులను గవర్నర్ కి పంపడం వెనుక ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారంలోనూ వైకాపా అడ్డుగోలుగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందని.. రెండు బిల్లులు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆలపాటి హెచ్చరించారు. సీపీఐ నాయకులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాజధాని మార్చాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. స్వయాన ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించాలన్నారు. గవర్నర్ ఆమోదానికి వెళ్లిన రెండు బిల్లులను తక్షణమే తిరస్కరించాలని అయన డిమాండ్ చేశారు.