"వర్షాలు కురవకపోతే ఏం చేద్దాం...?" - weather
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తుగా అప్రమత్తం అవుతున్నారు. వర్షాలు కురవపోతే ఏం చేయాలి.. అనే అంశంపై దృష్టి సారించారు. ప్రత్యామ్నాయ చర్యలపై కసరత్తు ప్రారంభించారు.
రాష్ట్రంలో వర్షాలు తగిన స్థాయిలో కురవకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ వెల్లడించారు. గుంటూరులోని వ్యవసాయశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ మురళీధర్ రెడ్డి, హైదరాబాద్ లోని మెట్టపంటల పరిశోధన కేంద్రం-క్రీడా సంచాలకులు రవీంద్రా చారి, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వివిధ జిల్లాలకు చెందిన వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలోని జిల్లాల్లో పరిస్థితులపై జిల్లా అధికారులు తీసుకువచ్చిన నివేదికలు... వారు సూచించిన ప్రణాళికలు... క్రీడా అధికారులు, శాస్త్రవేత్తల సూచనలపై చర్చించారు. రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వర్షపాతం తగ్గే సూచనలున్నట్లు వాతావరణ శాఖ నివేదించింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించినట్లు రాజశేఖర్ తెలిపారు. వారంలోనే ప్రత్యామ్నాయ ప్రణాళికకు తుదిరూపు ఇస్తామన్నారు. మిగతా జిల్లాల్లో కూడా వర్షపాతం తగ్గితే ఏం చేయాలనేది ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.