ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో రోజువారీ విచారణ - అమరావతి రైతుల నిరసన తాజా వార్తలు

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో రోజువారీ విచారణ జరిగింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని చెబుతున్న ప్రభుత్వం.. అభివృద్ధి చెందిన విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. మూడు రాజధానుల బిల్లును మండలి ఆమోదించలేదు. రెండు బిల్లుల్ని సెలెక్టు కమిటీకి సిఫారసు చేస్తే.. కమిటీ వేయకుండా శాసనసభ/ మండలి కార్యదర్శి జాప్యం చేశారు. మండలి ఛైర్మన్‌ సంతకం లేకుండానే గవర్నర్‌ బిల్లులను ఆమోదించడం చట్టవిరుద్ధం’ అని పేర్కొన్నారు.

రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ
రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ

By

Published : Dec 3, 2020, 7:28 PM IST

Updated : Dec 4, 2020, 4:46 AM IST

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ ప్రాంతంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజధానితో ముడిపడిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రోజువారీ తుది విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గురువారం న్యాయవాదులు డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు, నర్రా శ్రీనివాసరావు, పీఎన్‌ఆర్‌వీ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. మిగిలిన వ్యాజ్యాల్లో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు
‘శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలను మూడు వేర్వేరు చోట్లకు మారిస్తే పాలన కష్టమవుతుంది. ఏపీ పునర్విభజన చట్టం, సీఆర్‌డీఏ చట్టాలకు... ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన చట్టాలు విరుద్ధంగా ఉన్నాయి. అమరావతికి భూములిచ్చిన రైతుల్ని సంప్రదించకుండా రాజధాని తరలిస్తూ, వారి హక్కులను ఉల్లంఘిస్తున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు’ అని న్యాయవాదులు వాదించారు. సుప్రీంకోర్టు, హైకోర్టును సంప్రదించకుండా కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న నిర్ణయం ఏకపక్షం, అసలు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ చట్టం చేసే అధికారమే రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.

తెలంగాణకు హైదరాబాద్‌ రాజధాని అని విభజన చట్టం ద్వారా కేంద్రం నిర్ణయించినప్పుడు.. ఏపీ విషయంలో తమ పాత్ర లేదని ఎలా చెబుతుంది? అని ప్రశ్నించారు. తెదేపా ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు దాఖలు చేసిన వ్యాజ్యం తరఫున న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదిస్తూ ‘ద్విసభ విధానం అమల్లో ఉన్న ఏపీలో శాసనమండలిలో బిల్లులు పాస్‌ కాకుండా ప్రభుత్వం తెచ్చే చట్టాలు చెల్లుబాటు కావు. మూడు రాజధానుల బిల్లును మండలి ఆమోదించలేదు. రెండు బిల్లుల్ని సెలెక్టు కమిటీకి సిఫారసు చేస్తే.. కమిటీ వేయకుండా శాసనసభ/ మండలి కార్యదర్శి జాప్యం చేశారు. మండలి ఛైర్మన్‌ సంతకం లేకుండానే గవర్నర్‌ బిల్లులను ఆమోదించడం చట్టవిరుద్ధం’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:జగన్‌..అవగాహనలేని జీరో సీఎం: చంద్రబాబు

Last Updated : Dec 4, 2020, 4:46 AM IST

ABOUT THE AUTHOR

...view details