TRS MLAs: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పీఎస్కు తరలించారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ స్వామిజీల నుంచి పోలీసులు మరోసారి వాంగ్మూలం సేకరించారు. ముగ్గురికి పోలీస్స్టేషన్లోనే మొయినాబాద్ పీహెచ్సీ వైద్యుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని అ.ని.శా జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు. హైకోర్టు ఆదేశాలు ఉండటంతో పోలీసుల కస్టడీ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు.
తెరాసను వీడి భాజపాలో చేరితే రూ.100 కోట్లతో పాటు.. సివిల్ కాంట్రాక్టు పనులు ఇస్తామని ప్రలోభపెట్టారని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 27న న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా.. రిమాండ్ చేయడానికి తిరస్కరించారు. నిందితులను అరెస్ట్ చేయడాని కంటే ముందు 41 సీఆర్పీసీ ఇవ్వలేదని.. అ.ని.శా కోర్టు న్యాయమూర్తి పోలీసులను తప్పుపట్టారు. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులకు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించారు.