జనసేన పార్టీలో కీలకంగా వ్యహారించటమే గాకుండా..అధినేత పవన్ అండగా నిలిచిన నాయకుల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ ఆ పార్టీని వీడుతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సభాపతిగా వ్యహారించిన ఆయన... విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. కొంతకాలం పాటు నిశ్శబ్ధంగా ఉన్న నాదెండ్ల.. పవన్‌తో అడుగులేశారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
నాదెండ్ల మనోహర్ పార్టీ మారతారా!
జనసేన పార్టీలో అగ్రనేతగా ఉన్న నాదెండ్ల మనోహర్.. పార్టీ వీడుతారన్న ఊహాగానాలు కలకలం రేపాయి. ఈ పుకారులను ఆ పార్టీ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారని వచ్చిన వెంటనే అన్నింటిపై స్పందిస్తారని తెలియజేసింది.
జనసేనలో కీలన నాయకుడిగా నాదెండ్ల
పవన్ స్థాపించిన జనసేనలో చేరిన నాదెండ్ల... అధినేతకు అండగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలను చక్కబెడుతూ సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనూ కీలకంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో జనసేనకు కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఓటమికి గల కారణాలపై పార్టీ అధినేత సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ఆయన రాకపోయేసరికి పార్టీ మార్పుపై ఊహాగానాలు చెలరేగాయి. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఆ పార్టీని వీడినందున... మనోహర్ కూాడా అదే బాటలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఖండించిన జనసేన వర్గాలు
నాదెండ్ల జనసేన వీడుతారన్న వార్తలను ఆ పార్టీ వర్గాలు ఖండించాయి. విదేశీ పర్యటనల్లో ఉన్నందునే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని స్పష్టత ఇచ్చింది. అంతమాత్రాన పార్టీ మారుతున్నారని ప్రచారం సాగటం సరైనది కాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి దుష్ప్రచారాన్ని శ్రేణులు నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఆయనతో నేరుగా ఫోన్‌లో సంప్రదించామని... ఈ పుకార్లు వినీ ఆయన ఆశ్చర్యానికి గురయ్యారని పేర్కొంది. కుటుంబసభ్యులతో కలసి విదేశీ పర్యటనలో ఉన్న సమయాన్ని చూసుకొని పుకార్లను సృష్టించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.