పన్ను వసూళ్లు పెరిగాయ్ : బడ్జెట్ ప్రసంగంలో పీయూష్ గోయల్ - budget 2019-20
పన్నుల వసూళ్లు పెరిగాయని బడ్జెట్ ప్రసంగంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
అయిదేళ్ల పాలన ముగుస్తున్న సమయంలో...లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ఎన్డీఏ తాత్కలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయాన్ని రూ. 27, 84, 200 కోట్లగా అంచనా వేశారు. బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్..పన్నుల పరిమితులు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లలపై మాట్లాడారు. ప్రస్తుత ఏడాదిలో నెలకు రూ. 97,100 కోట్ల పన్నులు వసూళ్లవుతున్నాయని మంత్రి తెలిపారు. గత ఐదేళ్లో రాష్ట్రాల పన్ను వసూళ్లు 14 శాతం పెరిగాయని తెలిపారు. ఎగవేతదారులపై తీసుకొంటున్న చర్యలతో రూ. లక్ష కోట్లకు పైగా లెక్కలోకి వచ్చాయన్నారు. 2017-18లో కోటి 6 లక్షల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేశారని, ఈ రిటర్న్ 94.54 శాతం యథావిధిగా ఆమోదించామని పీయూష్ గోయల్ అన్నారు. వచ్చే రెండేళ్లలో పన్ను రిటర్న్‌ల విధానాన్ని ఎలక్ట్రానిక్‌గా మారుస్తామన్నారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 6 లక్షల కోట్ల నుంచి రూ. 12 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.