4 కోట్లకు చేరనున్న ఓటర్ల సంఖ్య రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4 కోట్లకు చేరే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న తుది జాబితా ప్రకారం ఉన్న 3.69 కోట్ల మంది ఓటర్లకు, అదనంగా మరో 37 లక్షల 30వేల మంది కొత్త ఓటర్లు జతకానున్నారు. ఓటరు నమోదు కోసం ఎన్నికల సంఘం ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. గడువు పూర్తైన మార్చి 15 ఒక్క రోజునే 5 లక్షల ఫారమ్-6 దరఖాస్తులు తమకు అందాయని ఆయన వివరించారు. పత్రాలు సరిగాలేని 3 లక్షల దరఖాస్తులను తిరస్కరించామని అన్నారు. మార్చి 26న అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని ద్వివేది స్పష్టం చేశారు. మార్చి 25 తేదీనాటికి పరిశీలన ప్రక్రియ ముగిశాక వీరందరికీ ఎపిక్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఓటు లేని వ్యక్తే ఉండకూడదన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి 31లోపు పోస్టల్ బ్యాలెట్‌పై అవగాహన సమావేశాలు నిర్వహిస్తామన్నారు. దాదాపు 4 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే అవకాశముంది. ఇప్పటి వరకు ఎక్సైజ్ దాడుల్లో మార్చి 1 నుంచి 15 వరకూ సుమారు 5కోట్ల 44లక్షల మద్యం సీజ్ చేశామని అన్నారు. 18 లక్షల విలువైన వివిధ రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నామని తెలిపారు. 2014 సాధారణ ఎన్నికల్లో 9కోట్ల4 లక్షల విలువైన మద్యం సీజ్ చేశామని, అసలు ప్రచారం ప్రారంభం కాకమునుపే 6 కోట్ల వరకూ మద్యం ఇప్పడు సీజ్ చేయగలిగామని ఆయన తెలిపారు.