ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల వేల సంక్షేమ మంత్రం...!!

సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 2019-20 ఓట్​ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ రూపొందించింది. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నందున... బడ్జెట్‌లో అన్ని వర్గాలకు నజరానాలు ప్రకటించారు. రైతులు.. సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, వ్యవసాయం, యువజన సంక్షేమం, మహిళా సంక్షేమానికి అధికంగా నిధులు కేటాయించారు.

By

Published : Feb 5, 2019, 8:53 PM IST

2019-20 ఓట్​ ఆన్ అకౌంట్ బడ్జెట్‌

సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 2019-20 ఓట్​ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ రూపొందించింది. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నందున... బడ్జెట్‌లో అన్ని వర్గాలకు నజరానాలు ప్రకటించారు. రైతులు.. సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, వ్యవసాయం, యువజన సంక్షేమం, మహిళా సంక్షేమానికి అధికంగా నిధులు కేటాయించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెదేపా సర్కారు సంక్షేమ మంత్రం జపించింది. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌గా ప్రభుత్వం పేర్కొంటున్నా.. పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని... రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకాలే కాకుండా.. బడ్జెట్​లో నూతన వరాలు ప్రకటించారు. సాగునీటి, వ్యవసాయ రంగాల కేటాయింపులు పెంచారు. రైతులు, మహిళలు, పేదలు, యువత, నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రాజధాని నిర్మాణానికి ఎక్కువ నిధులు కేటాయించింది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి.. బడ్జెట్‌ అంచనా రూ.2,26,117.53కోట్లు కాగా, గతేడాది కన్నా 18.38శాతం పెరుగుదల ఉంది. రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.29,596.33కోట్లు, రెవెన్యూ మిగులు విలువ రూ.2099.47 కోట్లుగా అంచనా వేశారు. ఆర్థికలోటు 32,390.68కోట్లుగా అంచనా వేశారు.
నూతన పథకాలు.. అధిక నిధులు....
ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.300కోట్లు.. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ రూ.1000 కోట్లు... పశుగ్రాసం అభివృద్ధికి రూ.200 కోట్లు... పశువులపై బీమా కోసం రూ.200కోట్లు... చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.400 కోట్లు... డ్రైవర్స్‌ సాధికార సంస్థకు రూ.150కోట్లు... ఇళ్ల స్థలాల సేకరణ కోసం రూ.500 కోట్లు... క్షత్రియుల సంక్షేమం కోసం రూ.50కోట్లు ... వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లకు రూ.3వేల కోట్లు... బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు.. వీటితో పాటు నిరుద్యోగ భృతిని రూ.2వేలకు పెంచారు.

రైతులకు శుభవార్త..
బడ్జెట్‌లో అన్నదాతల కోసం 'అన్నదాత సుఖీభవ' పేరుతో వినూత్న పథకాన్ని ప్రవేశ పెట్టింది. పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించబోతోంది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి రూ.12,732.97 కోట్లు కేటాయించారు. యాంత్రీకరణ, బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తామన్న ప్రభుత్వం... ఆ రంగానికి నిధులు పెంచింది.

పల్లెకు బాసట...
గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ఈ ఏడాది అధిక నిధులు కేటాయించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు భారీగా నిధులు పెంచారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.31,208.82 కోట్లు కేటాయించగా... ప్రస్తుతం సుమారు 4వేల కోట్లు అదనంగా... రూ.35,182.61 కోట్లు కేటాయించారు.

2019-20 ఓట్​ ఆన్ అకౌంట్ బడ్జెట్‌

ఐటీకి అంతే..
ఐటీ, పర్యావరణ అటవి సంరక్షణ శాఖలకు నిధులు గతేడాదితో పోలిస్తే అంతగా నిధులు పెంచలేదు. కేవలం 50 కోట్లు మాత్రమే పెంచారు. జలవనరుల శాఖకు గతేడాది రూ.14,862.16 కోట్లు కేటాయించగా... ఈ ఏడాది 2వేల కోట్లు అదనంగా.. రూ. 16,852.27 కోట్లు కేటాయించారు.

బాధ్యతగా...
ఈ బడ్జెట్‌లో చంద్రబాబు సర్కారు మహిళల కోసం భారీగా నిధులు కేటాయించింది. డ్వాకా మహిళల కోసం పసుపు కుంకుమ కింద 135శాతం అధికంగా నిధులు కేటాయించారు. వడ్డీ లేని రుణాల ఇవ్వడానికి గతంకంటే ఈసారి 10 శాతం అధిక నిధులు పెంచారు. ప్రతి మహిళకు 10 వేల రూపాయలు అందజేయనున్నారు. 93.81 లక్షల మందికి రూ.9,381 కోట్ల లబ్ధి చేకూరుతుంది. మహిళలకు రూ.2,514కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నారు.

డ్రైవర్లకు అండగా...
రాష్ట్రంలో డ్రైవర్లందరికీ లబ్ధి చేకూరేలా... సాధికార సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పలు రకాల వాహనాల డ్రైవర్లు దాదాపు 10 లక్షల మంది ఉంటారు. వారందరికీ లబ్ధి చేయడానికి రూ. 150కోట్లు కేటాయించారు.

పెరిగిన నిరుద్యోగ భృతి...
ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో భాగంగా... నిరుద్యో యువతకు గతంలో రూ. వెయ్యి భృతి ఇచ్చేవారు. దానిని రూ.2 వేలకు పెంచారు. ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ.1200 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకానికి రూ.100 కోట్లు కేటాయించారు.

ABOUT THE AUTHOR

...view details